తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టిన మరుక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. తన ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేసిన వృద్ధ నేతలను ఇప్పటికే కలిసి బుజ్జగించిన రేవంత్… తాజాగా శనివారం మరో ఇద్దరు కీలక వ్యక్తులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలుగు మీడియా రంగంలో బిగ్ షాట్స్ గా భావిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో భేటీ అయిన రేవంత్… ఆ వెంటనే టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితోనూ రేవంత్ సుదీర్ఘ మంతనాలు సాగించారు.
అధిష్ఠానాన్ని ఒప్పించి..
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడంతో పాటుగా కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా పనిచేయాలని నిర్ణయించుకున్న రేవంత్.. టీ పీసీసీ చీఫ్ పదవి కోసం తనదైన శైలిలో యత్నించారు. తనకు పదవి దక్కితే… ఏం చేస్తాను? ఎలా చేస్తాను? అంతిమ లక్ష్యం ఏమిటి? అన్న వాటిపై పార్టీ అధిష్ఠానికి పూసగుచ్చినట్లుగా రేవంత్ వివరించారు. అయితే తాను ఏమైతే ఆశిస్తుందో… అవే అంశాలను రేవంత్ కూడా బలంగా ప్రొజెక్ట్ చేయడంతో ఆయన వాదనలకు సరేనన్న అధిష్ఠానం ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించింది.
సీనియర్లను బుజ్జగించి..
పార్టీలోకి కొత్తగా వచ్చి చేరినా… పార్టీ అధిష్ఠానం వద్ద తన మాట నెగ్గించుకున్న రేవంత్.. తాను ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కేసీఆర్ సర్కారును కూల్చడంతో పాటుగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు పక్కా వ్యూహాలనే రచించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే టీ పీసీసీ చీఫ్ పదవిని తనకు దక్కకుండా అడ్డుకునేందుకు యత్నించిన పార్టీ సీనియర్లను వరుసగా కలుస్తున్న రేవంత్ వారిని తన దారిలోకి తెచ్చుకున్నట్లుగానే కనిపించారు. తన తొలి అడుగులో మంచి ఫలితాలనే సాధించిన రేవంత్ మలి అడుగును అందరూ ఆశ్చర్యపోయేలా వేశారని చెప్పాలి.
ఏబీఎన్ రాధాకృష్ణతో భేటీ
శనివారం ఉదయం నేరుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి… ఆయనతో ప్రత్యేక భేటీని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ కు రాధాకృష్ణ విషెస్ చెబితే.. రేవంత్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొంతసేపు మాట్లాడుకున్న వారిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా శనివారం రాత్రి రేవంత్ వ్యూహాలకు సంబంధించి ఏబీఎన్ లో ఓ ప్రత్యేక కథనం కూడా రానుంది. రాధాకృష్ణతో రేవంత్ భేటీ మరుక్షణమే ఈ కథనానికి సంబంధించి ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ కథనంలో రేవంత్ తన భవిష్యత్తు వ్యూహాలను వివరించే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
నేరుగా బీఆర్ నాయుడు వద్దకు..
రాధాకృష్ణతో భేటీ ముగించుకున్న రేవంత్ రెడ్డి… అటు నుంచి అటే టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు వద్దకు బయలుదేరారు. తప వద్దకు వచ్చిన రేవంత్ కు బీఆర్ నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడితోనూ రరేవంత్ కీలక అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తున్న కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేయబోతున్నానని, మీడియా పరంగా మీ అందరి సహకారం కావాలని కూడా బీఆర్ నాయుడును రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. అందుకు బీఆర్ నాయుడు కూడా సానుకూలంగానే స్పందించినట్లుగా తెలుస్తోంది.
ఈ భేటీల వెనుక వ్యూహమేంటి?
ఓ వైపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, మరోవైపు టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడులను ఒకే రోజు రేవంత్ రెడ్డి కలిసిన వైనంపై మీడియాలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం టీఆర్ఎస్ కు దగ్గరవక తప్పలేదన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గ నేతలకు టీఆర్ఎస్ లో క్రమేణా ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో ఆ వర్గం నేతలను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే దిశగానే రేవంత్.. రాధాకృష్ణ, బీఆర్ నాయుడులను కలిసినట్లుగా సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి.