నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న అనంతపురానికి చెందిన విద్యార్థినికి అండగా నిలిచారు. స్వప్న అనే ఇంటర్ విద్యార్థిని బోన్ క్యాన్సర్ తో బాధపడుతోందని తెలుసుకున్న ఆయన ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రప్పించారు. బసవతారకం హాస్పిటల్‌కు బాలకృష్ణ మేనేజింగ్ ట్రస్టీ, ఛైర్మన్‌గా అనే సంగతి తెలిసిందే.హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వప్నకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఆమెకు శస్త్రచికిత్స చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న స్వప్నను బాలకృష్ణ మంగళవారం పరామర్శించారు. ఆమెకు అండగా తానున్నానని స్వప్నకూ, ఆమె తల్లికీ ధైర్యం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతపురంలోని సోమనాథనగర్ చెందిన వెంకట్రాముడు, అరుణల కుమార్తె స్వప్న. వెంకట్రాముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో స్వప్న మెరుగైన చికిత్స అందించలేని పరిస్థితి.
స్వప్న గురించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన బాలకృష్ణ వెంటనే స్పందించారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యే కూడా కావడంతో జిల్లా అధికారుల ద్వారా స్వప్న గురించి ఆరా తీశారు. జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ గౌస్ మొయిద్దీన్, ఆర్డీటీ ఛైర్మన్ తిప్పేస్వామిలను ఆమె ఇంటికి పంపారు. స్వప్న తల్లి అరుణతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. స్వప్నకు బసవతారకం హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్వప్నకు బాలకృష్ణ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఈరోజు ఆమెను కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు.