నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒక్కటే రాజధాని ఉండాలని, ఆ రాజధాని కోసం తృణప్రాయంగా మూడు పంటలు పండే భూములను ఇచ్చేసిన రైతులు 300 రోజులకు పైగా దీక్షలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలపై అధికార పార్టీ వైసీపీ నేతలు ఎన్నెన్ని వింత, వికారం వ్యాఖ్యలు చేస్తున్నా… రైతులు మొక్కవోని దీక్షలతో ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడు అమరావతిలో ఓ కొత్త వింత ఆసక్తి ,రేకెత్తిస్తోంది.
ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని వద్దని, సీఎం జగన్ ప్రతిపాదించినట్లుగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సిందేనని ఓ వర్గం దీక్షలు మొదలెట్టేసింది. అది కూడా అమరావతి పరిధిలోని తాళ్లాయపాలెంలోనే కావడం మరింత ఆసక్తికరం. అంటే… అమరావతి రాజధానిగా వద్దంటూ అమరావతిలోనే ఉద్యమం అన్న మాట.
టీడీపీ పాలనలో రాజధాని లేని నవ్యాంధ్రకు అన్ని ప్రాంతాలకు సమదూరంలో రాజధాని ఉండాలన్న భావనతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. ఆ రాజధాని నిర్మాణం కోసం అక్కడి వేలాది మంది రైతులు 33 వేల ఎకరాలకు పైగా భూములను ఇచ్చారు. అమరావతి రాజధానిని టీడీపీ సహా అన్ని పార్టీలు కూడా సమర్థించాయి.
ఇందులో నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుతం సీఎం జగన్ కూడా అసెంబ్లీ వేదికగానే సమర్థించారు. పైపెచ్చు రాజధాని పరిధిలోనే తాను ఇల్లు కట్టుకుంటున్నట్లుగా ప్రకటించి… ఇల్లు కూడా నిర్మించుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే మాట మార్చేసిన జగన్… మూడు రాజధానుల మాట ఎత్తుకున్నారు.
ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు నిరసన దీక్షలు ప్రారంభించారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అన్న నినాదంతో రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజులు దాటిపోయాయి. ప్రభుత్వం ఈ దీక్షలను పట్టించుకోకున్నా కూడా రాజధాని రైతులు తమదైన శైలిలో దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి క్రమంలో రాజధాని రైతుల దీక్షలకు వ్యతిరేకంగా అమరావతి పరిధిలోనే మూడు రాజధానులకు మద్దతుగా, అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఓ వర్గం దీక్షలను ప్రారంభించేసింది.
ఈ దీక్షలకు తమకు అనుకూలమైన వర్గాలను రప్పిస్తూ సదరు వర్గం రిలే దీక్షలను కొనసాగిస్తోంది. అంటే… రాజధాని రైతుల దీక్షలకు వ్యతిరేకంగా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోనే దీక్షలన్న మాట. మొత్తంగా ఇప్పుడు అమరావతిలో ఓ వైపు అమరావతిని రక్షించుకునే దిశగా రైతులు దీక్షలు చేస్తుంటే.. మరోవైపు అదే రాజధాని అమరావతికి వ్యతిరేకంగా అక్కడే దీక్షలు మొదలయ్యాయయన్న మాట.