మైత్రీ మూవీస్ దూకుడు మామూలుగా లేదు. ఓ పక్క భారీ సినిమాలు, ఇంకో పక్క మధ్య తరహా సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా నాని హీరోగా నటించే 28వ సినిమాను ప్రకటించింది. ఇంతకుముందు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలను రూపొందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో నానీకి జోడీగా మలయాళ భామ నజ్రియా నజీమ్ నటించబోతోంది. ఈ సినిమాకి సంబంధించి తాజా అప్ డేట్ ఏమిటంటే ఈ నెల 21వ తేదీన ఈ సినిమా పేరును ప్రకటిస్తారు. ఇతర వివరాలన్నీ త్వరలోనే వెల్లడవుతాయి.
మహేష్ బాబు ‘శ్రీమంతుడు’తో మైత్రీ మూవీస్ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. చాలా తక్కువ కాలంలో పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. జనతా గ్యారేజ్, రంగస్థలం, సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటొని, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాలు నిర్మించింది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మిస్తున్న ‘ఉప్పెన’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ తో నిర్మిస్తున్న ‘పుష్ప’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లోనూ ఓ సినిమా రూపొందనుంది. మొత్తానికి చిత్ర నిర్మాణ రంగంలో మైత్రీ మూవీస్ దూకుడు మామూలుగా లేదు. (AlsoRead;-కరోనాని కూడా లెక్కచేయని నానీ సినిమా