రాజమౌళి ‘యమదొంగ’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయింది మలయాళ కుట్టి మమతా మోహన్ దాస్. స్వతహాగా ఆమె గాయని అయినప్పటికీ.. గ్లామరస్ గాళ్ గానే ఫేమస్ అయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సైతం అందం, అభినయంతో మెప్పించింది. గాయనిగానూ పలు భాషల్లో పాటలు పాడి మెప్పించింది.
ఎర్లియర్ గా మమతా మోహన్ దాస్ నటించిన ‘ఫోరెన్సిక్’ మూవీ సూపర్ హిట్టైన నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు ‘లాల్ బాగ్’ అనే మరో థ్రిల్లర్ మూవీ అవకాశమొచ్చింది. అలాగే తేడల్ ‘రామసేతు’ అనే మరో రెండో సినిమాలకి కమిట్ అయింది. అయితే మమతా తెలుగులో కనిపించి చాన్నాళ్ళయిపోయింది. ఇదిలా ఉంటే ఆమె ప్రొడ్యూసర్ గానూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. మమతామోహన్ దాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు తీయాలని నిర్ణయించుకుంది. నోయల్ బెన్ అనే ఒక బిజినెస్ మేన్ ని నిర్మాణ భాగస్వామిని చేసుకుంది.
మహిళలకు పిల్లలకు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే సినిమాలు నిర్మించాలని మమతా నిర్ణ యించుకుందట. ఇటీవల అమెరికా నుంచి తిరిగివచ్చిన మమతా మోహన్ దాస్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియచేసింది. తనకి చిత్ర పరిశ్రమ ఎంతో ఇచ్చింది. అందుకే తాను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కాబట్టి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టానని అంటోంది. మరి మమతా.. నిర్మాణానికే అధిక ప్రధాన్యతనిచ్చి.. నటనకు మంగళం పాడుతుందేమో చూడాలి.











