వైఎస్ఆర్ సీపీ హయాంలో సాధారణ ప్రజలను సహా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఉన్నతాధికారులు, నేతల పేర్లను టీడీపీ నేత నారా లోకేశ్ రెడ్ బుక్ లో రాసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ-బీజేపీ-జనసేన ప్రభుత్వం రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిని వదలబోదని, దానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమను పగబడుతోందని, ప్రతిపక్ష వైసీపీ నేతలు భయపడిపోతూ ఆరోపిస్తున్న వేళ.. మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై సూటిగా స్పష్టత ఇచ్చారు.
“ప్రజలను, పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను రెడ్ బుక్‌లో పెట్టాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని శిక్షిస్తామని నేను ప్రతి బహిరంగ సభలో స్పష్టంగా చెబుతూ వచ్చాను. నేను రెడ్ బుక్‌ను బహిరంగంగా ప్రదర్శించాను. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టే వారికి వార్నింగ్ ఇచ్చాను. నేను చెప్పినదానికి కట్టుబడి ఉన్నాను. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బాధ కలిగించిన వారిని వదిలిపెట్టను’’ అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఇప్పటికే నారా లోకేశ్ రెడ్ బుక్ లోని పేర్లకు తగ్గట్లుగా ఒక్కొక్కరిపై కొరడా పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రి గోల్డ్ భూములను నకిలీ పత్రాలతో తన పేరు మీద బదలాయించుకున్న కేసులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఆయన అగ్రిగోల్డ్ భూములను అమ్మి సొమ్ము చేసుకున్నాడు. మరోవైపు అగ్రి గోల్డ్ బాధితులు ఇంకా న్యాయం కోసం పోరాడుతున్నారు. అధికార దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురిచేసిన వారిలాంటి దోషులను వదిలేద్దామా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. వైఎఎస్ఆర్ సీపీ హయాంలో అన్యాయానికి గురైన వారందరికీ ప్రజలు అండగా ఉంటారని, రెడ్ బుక్‌ను ప్రజలు ఆమోదించారని నారా లోకేష్ కూడా వెల్లడించారు.
అన్నా క్యాంటిన్లు ప్రారంభించిన సందర్భంగా నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లో పేర్లు ఉన్న మిగతావారు కూడా త్వరలోనే కష్టాలపాలు అవుతారని లోకేశ్ హెచ్చరించారు. ఇక అన్నా క్యాంటిన్ల గురించి మాట్లాడుతూ.. త్వరలో ఇంకో 99 అన్నా క్యాంటిన్లు ప్రారంభం అవుతాయని చెప్పారు. తొలి విడతగా 100 క్యాంటిన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామని.. అతి త్వరలోనే వాటి సంఖ్య రెట్టింపు అవుతుందని వెల్లడించారు.











