ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు. దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇది ఊహించని పరిణామం అని జగన్ సైతం భావిస్తున్నారు. కాస్త కష్టపడితే గెలిచే అవకాశం టీడీపీకి ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను లైట్ తీసుకోవడం ఊహించని ట్విస్ట్ అని వైసీపీ భావిస్తోంది.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. బుధవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇప్పుడు పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో ఆ ఉప ఎన్నిక బరిలో ఇద్దరే ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు వేశారు. గడువులోపు ఈ స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటే బొత్స సత్యనారాయణకు లైన్ క్లియర్ అయి ఏకగ్రీవంగా ఎన్నిక అవనున్నారు. ఒకవేళ స్వతంత్ర పోటీ చేసినా ఎన్నిక జరిగినప్పటికీ బొత్స సత్యనారాయణే గెలవనున్నారు. ఈ నెల 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.
ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పాల్గొనే ఓటర్లలో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వారే ఉన్న సంగతి తెలిసిందే. ఓటర్లుగా ఉండే జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు దాదాపు 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచిన వారే ఉన్నారు. కానీ, చాలా మంది కూటమి పార్టీలకు ఆకర్షితులై వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇంకొంత మంది కూడా రెడీగా ఉన్నారు. దాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం.. స్థానిక టీడీపీ నేతలకు తేలికైన పని. కానీ, ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు భావించారు.
చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు కూడా ఆమోదించారు. దీంతో చంద్రబాబు విలువలకే మరోసారి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, నిన్న మొన్నటి వరకు జగన్ మాత్రం ఈ విషయంలో చంద్రబాబును విమర్శిస్తూనే వచ్చారు. చంద్రబాబుకు ఏ మాత్రం విలువలపై గౌరవం ఉన్నా.. అభ్యర్థిని నిలపవద్దని పదే పదే గగ్గోలు పెట్టారు. కనీసం చంద్రబాబు ఏ అభ్యర్థిని ఖరారు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టకముందే జగన్ భయపడిపోయారు. అయితే, ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని చంద్రబాబు వదులుకోవడం వెనుక వ్యూహాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.