ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. GST సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్య తరగతికి మేలు జరుగుతుందని ప్రధానికి వివరించారు లోకేష్. ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలిపారు లోకేష్. విద్యారంగంలో వస్తువులపై GST తగ్గించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్.
ఇక, రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చించారు లోకేష్. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని ప్రధానిని లోకేశ్ కోరారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని.. ఉన్నతవిద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రధాని స్పందిస్తూ..రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేశ్ బహుకరించారు. ఈ పుస్తకాన్ని యోగాంధ్ర ప్రాంతం, అక్కడి సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ రూపొందించారు. నిజానికి యోగాంధ్ర సక్సెస్‌పై ప్రధాని మోదీ కేస్ స్టడీ చేయాలని కేంద్ర కేబినెట్ లోనూ ప్రస్తావించారు.
మే 17న తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి నారా లోకేష్ మోదీని కలిశారు. మళ్లీ 4 నెలల వ్యవధిలోనే నారా లోకేష్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని కలిశారు











