మన దగ్గర సినిమా కథ ఏదైనా ఉంటే దాన్ని ఎవరికి చెప్పాలి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. అసలు మనకథని ఎవరికీ చెప్పకుండా మనమే దర్శకుడు అయినపుడు దాన్ని బయటికి తీస్తే బాగుంటుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయినా, లేదా టైటిల్ బయటికి వచ్చినా ఇది నా కథే అనే వారు ఎక్కువమందే సినిమా పరిశ్రమలో కనిపిస్తుంటారు. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా కూడా అలాంటి వివాదాల్లోకి వెళ్లింది.
ఆ సినిమా దర్శకుడు అలాంటి ఇలాంటి వాడు కూడా కాదు. సినిమాల కథలను అవుపోశన పట్టిన దిగ్గజం కొరటాల శివ. ఆయన కథలను కాపీ కొడతారంటే ఎవరూ నమ్మకు కూడా. కానీ ఆచార్య కథ కాపీ అనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. నిన్న ఒక పేరు వెలుగులోకి వస్తే ఈరోజు రాజేష్ మండూరి అనే వ్యక్తి ఈ కథ తనదేనని అంటున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూ, మైత్రీ మూవీస్ కూ మాత్రమే తెలిసిన ఈ కథ కొరటాల దగ్గరకి ఎలా వెళ్లిందనేది రాజేష్ అనే కోడైరెక్టర్ సంధిస్తున్న ప్రశ్న.
రాజేష్ ఏమంటున్నారు?
కథ తనదేనంటున్న రాజేష్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే…‘నేను 18 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ మొదలుకుని కోడైరెక్టర్ గా ఎదిగాను. డైరెక్టర్ కావాలన్న సంకల్పంతో కొన్ని కథలు తయారుచేసుకున్నాను. 2018 అక్టోబరు 2న గోరంట్ల పేరయ్య అనే వ్యక్తితో మా ఎమ్మెల్యే రవికుమార్ ను కలిశాను. ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నావు అంటూ ఆయన నన్ను కుశల ప్రశ్నలు అడిగి కథలు ఏమైనా ఉన్నాయా? అనడిగారు. బాలకృష్ణ కోసం ఓ కథ రాసుకున్నాననటంతో లైన్ చెప్పమన్నారు.
తనకు బాగా నచ్చి మా బ్యానర్ మైత్రీ మూవీస్ లో చెప్పవచ్చుకదా అన్నారు. అలా అక్టోబరు 3న మైత్రీ మూవీస్ లో కథ చెప్పే అవకాశం వచ్చింది. ఆ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవికుమార్, సీఈఓ చిరంజీవి (చెర్రీ)లకు కథ చెప్పాను. రవి బ్రీఫ్ గా కథ విని బయటికి వెళ్లిపోతే ఆ తర్వాత చెర్రీకి పూర్తి కథ చెప్పాను. ఆయన తన వాయిస్ రికార్డర్ ఆన్ చేసి విన్నారు. ఇప్పుడు అదే కథ కొరటాల శివ దగ్గరికి వెళ్లిపోయింది’ అని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనిల్ కృష్ణ ఎవరు?
రాజేష్ తోపాటు అనిల్ కృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆచార్య టైటిల్ తర్వాత వచ్చే సన్నివేశం తన కథ లాగే ఉందని అంటున్నాడు కన్నెగంటి అనిల్ కృష్ణ ‘పుణ్యభూమి’ అనే పేరుతో 2006లోనే రైటర్స్ అసోసియేషన్ లో ఈ కథనను రిజిస్టర్ చేసుకున్నట్లు చెబుతున్నారు. సినిమా మోషన్ పోస్టర్‌ని తన కథ నుంచి కాపీ కొట్టారనేది అతని అభియోగం. ఆచార్య మోషన్ పోస్టర్‌లో ధర్మస్థలి అనే ఎపిసోడ్ తన స్క్రిప్ట్ నుంచి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
కావాలనే కన్నెగంటి అనిల్ కృష్ణ పేరును తెరపైకి తెచ్చారన్నది రాజేష్ అభియోగం. తను ‘పెద్దాయన’ అనే పేరుతో ఈ కథ తయారుచేసుకున్నట్లు రాజేష్ చెబుతున్నారు. కథ మీద అన్ని హక్కులూ తనవేనని అంటున్నాడు. ఏపీ ఫిలిం ఛాంబర్ లో దీనికి సంబంధించిన టైటిల్ ను కూడా రిజిస్టర్ చేసుకున్నానని అతను అంటున్నాడు. ఈ రాజేష్ ఇంతకుముందు బి. గోపాల్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆరోపణలపైన కొరటాల టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.