ఏపీలో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసును CBIకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేస్తుండడం,కూటమి ప్రభుత్వంపై వైసీపీ లీడర్స్‌తో కలిసి ఆరోపణలు చేస్తుండడంతో ఈ ఇష్యూకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ నెల 4న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని కేంద్ర హోంశాఖకు పంపనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం సైతం సుగాలి ప్రీతి కేసును CBIకి అప్పగించింది. ఐతే జగన్ సర్కార్ ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. సీబీఐకి అప్పగించి చేతులు దులిపేసుకుంది. తమకు వనరుల్లేవని సీబీఐ మొర పెట్టుకున్నా..జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత CID విచారణ చేయించారు.అయితే అప్పటికే సాక్ష్యాలు సరిపోకపోవడం,కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని CID గుర్తించింది. దీంతో కేసు ముందుకు కదల్లేదు. ఇక పవన్ సైతం ప్రభుత్వం తరపున అన్ని విధాలా సాయం చేశారు.
ఐనప్పటికీ సుగాలి ప్రీతి కేసును రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. సుగాలి ప్రీతి తల్లికి లేనిపోనివి చెప్పి కూటమి సర్కార్‌పై విమర్శలు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ సారి సీరియస్ గా దర్యాప్తు జరిగేలా చూడనున్నారు. 2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో కనిపించారు. ఆమెను అత్యాచారం చేసి చంపారని తల్లి ఆరోపించారు. అయితే ఆధారాల్లేకపోవడంతో స్కూల్ నిర్వాహకులపై ఆత్మహత్య ప్రేరణ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా..ఆ ప్రభుత్వంపై విమర్శలకు సుగాలి ప్రతీ కేసు ఓ ఆయుధంగా మారుతోంది. ఐతే కేసును సీబీఐకి అప్పగించడంతో తాము సీరియస్‌గా ఉన్నామన్న భావనను ప్రజల్లోకి పంపింది కూటమి సర్కార్. అంతే కాదు, వైసీపీ రాజకీయ డ్రామాలకు చెక్ పెట్టినట్లయింది











