టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే కనిపిస్తారు. అలాంటి లోకేశ్ మోములో ఆగ్రహం దాదాపుగా కనిపించదనే చెప్పాలి. అయితే ఆయన ఆగ్రహం అంటూ వస్తే మాత్రం అవతలి వర్గం వణికిపోక తప్పదు. అప్పుడెప్పుడో… వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ విపక్షంలో ఉండగా…ఉమ్మడి కర్నూలు జిల్లా పెసరవాయి అనే గ్రామంలో టీడీపీకి చెందిన ఇద్దరు నేతలను అధికార పార్టీ శ్రేణులు హత్య చేశాయి. హత్యకు గురైన వారు స్వయానా అన్నదమ్ములు. ఈ ఘటన లోకేశ్ ను తీవ్రంగా కలచివేసింది. వెనువెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పెసరవాయి వెళ్లిన లోకేశ్… అక్కడ మిన్నంటిన రోధనలను చూసి ఆగ్రహావేశానికి గురయ్యారు. ఈ సందర్భంగా నాడు సీఎం హోదాలో ఉన్న జగన్ ను ఏకవచనంతో సంబోధిస్తూ… దమ్ముంటే రావాలంటూ సవాల్ విసిరారు. నాడు లోకేశ్ లో కనిపించిన కసి టీడీపీ శ్రేణుల్లో తర్వాతి ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలను నింపాయి. నాడు ఆగ్రమంతో ఊగిపోయిన లోకేశ్ తీరు…గురువారం నాటి శాసనసభ సమావేశాల్లో మరోమారు ఆవిష్కృతమైంది.
శాసన సభ సమావేశాలకు జగన్ సహా 10 వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. అయితే… శాసన మండలిలో తమకు బలమున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో గురువారం నాటి సమావేశాల్లో భాగంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ లపై వాయిదా తీర్మానం ఇచ్చిన ఆ పార్టీ సభ్యులు దానిపై చర్చకు పట్టుబట్టారు. ఈ అంశంపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామన్న టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు… సరైన సమయంలో చర్చిద్దామంటూ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనగా… చైర్మన్ సభను కొంతసేపు వాయిదా వేశారు. అనంతరం తిరిగి మండలి సమావేశం ప్రారంభం కాగానే… మంత్రి హోదాలో లోకేశ్ కూడా మండలికి వచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు చేస్తున్న దారుణాలను వైసీపీ ప్రస్తావించగా… వారికి సమాధానమిచ్చేందుకు లోకేశ్ సిద్ధమయ్యారు.
అయితే మండలిలో మెజారిటీ సభ్యులు వైసీపీ వారు కావడం, చైర్మన్ కూడా వైసీపీ నేతే కావడంతో లోకేశ్ ప్రసంగానికి కొంతమేర అడ్డంకి కలిగింది. అదే సమయంలో లోకేశ్ ను కూర్చోవాలంటూ చైర్మన్ ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన లోకేశ్… వైసీపీ జమానాలో సాగిన దురాగతాలను ఏకరువు పెడుతూ ఫైరైపోయారు. వైసీపీ అదికారంలో ఉండగా… నిండు శాసనసభలో తన తల్లిని అవమానించారంటూ ఆయన అన్నారు. ఏనాడూ తాము గానీ, తమ పార్టీ నేతలు గానీ జగన్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయలేదని ఆయన అన్నారు. తన తల్లిని వైసీపీ అవమానిస్తే.. తనను కూర్చోమని మీరు చెబుతారా? అంటూ ఆయన చైర్మన్ ను దాదాపుగా నిలదీసినంత పనిచేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీతపైనే వైసీనీ నేతలు పోస్టులు పెడుతున్న తీరుపైనా లోకేశ్ నిప్పులు చెరిగారు.
సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు రెచ్చిపోయి… ఇష్టారాజ్యంగా అసభ్య పదజాలంతో కూడిన పోస్టులను పెడుతుంటే తనను కూర్చోమంటారా అంటూ ఆయన ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. మహిళలను, బాలికలను తీవ్రంగా వేధిస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేయాల్సి ఉందని, అలాంటిది దానిపై మాట్లాడుతున్న తనను కూర్చోమని ఎలా చెబుతారని ఆయన చైర్మన్ ను నిలదీశారు. లోకేశ్ పదే పదే అవే వ్యాఖ్యలు చేయడంతో చైర్మన్ మిన్నకుండిపోయారు. ఈ సమయంలో వైసీపీ కూడా అసభ్యకరమైన పోస్టులను ప్రోత్సహించదు అంటూ మండలిలోవిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ మరోమారు ఫైరయ్యారు. నిండుసభలో తన తల్లిని అవమానించిన వారికి ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది వైసీపీనేనని, ఈ చర్యతో వారిని వైసీపీ ప్రోత్సహించినట్టే కదా అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు లోకేశ్ నోట నుంచి రాగానే.. బొత్సతో పాటు మొత్తం వైసీసీ శిబిరం సైలెంట్ అయిపోయింది. మొత్తంగా లోకేశ్ ఉఘ్రరూపంతో మండలిలో వైసీపీ శిబిరం తనకు బలమున్నప్పటికీ వణికిపోయిందనే చెప్పాలి.