టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో ఎలా వ్యవహరిస్తారన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఎందుకంటే… ఓ మంత్రిగా, ఏకంగా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కూడా ఏకంగా 15ఏళ్ల పాటు కొనసాగారు. మొత్తంగా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేతగా… ప్రభుత్వ పాలనలో సుపరిపాలనకు శ్రీకారం చుట్టిన నేతగానే కాకుండా ఇతర పార్టీలు అధికారంలో ఉండగా..సదరు ప్రభుత్వాలు చేసే తప్పులను అప్పటికప్పుడు ఎత్తి చూపుతూ సాగిన చంద్బరాబు అనుభవం నిజంగానే ఈ దేశానికే ఆదర్శమని చెప్పక తప్పదు. పాలనలో ఇప్పటికే తల పండిపోయిన చంద్రబాబు…ఎలాంటతి విపత్కర పరిస్థితులనైనా ఎలా అధిగమించాలన్న నేర్పుతో ముందుకు సాగుతున్నారు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, సమస్య ఏదైనా… దానికి అప్పటికప్పుడు పరిష్కారం చూపడంలో చంద్రబాబును మించినవారు దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు.
అయినా ఇప్పుడిదంతా ఎందుకూ అొంటారా?… పొరుగు రాష్ట్రం తెలంగాణలో చంద్రబాబు వద్ద రాజకీయ ఓనమాలు దిద్దుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరి తెలంగాణకు సీఎం అయ్యారు. అయినా కూడా తనకు చంద్రబాబు గురుతుల్యులు అని రేవంత్ చెబుతూనే ఉంటారు. ఇక విపక్షం హోదాలో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ పాలనా తీరుపై అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ కూడా నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ సర్కారుపై, ప్రత్యేకించి రేవంత్ అవలంబిస్తున్న విధానాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ఖ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తున్నారన్న ధర్మపురి… పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులా సుపరిపాలనను అందించాలని కోరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పాలన గురించి అరవింద్ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన కొనియాడారు. రాష్ట్రం బాగుండాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు… పెద్ద పెద్ద సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. వయసు మీద పడుతున్నా…కుర్రాడికి మల్లే చంద్రబాబు చురుగ్గా కదులుతున్న తీరు అందరికీ ఆదర్శమని కూడా అరవింద్ అన్నారు. అలాంటి చంద్రబాబు వద్ద శిష్యరికం చేసిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం చేతకాక చతికిలబడి పోతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చంద్రబాబునుచూసి అయినా రేవంత్ రెడ్డి తన పాలనా తీరును మార్చుకోవాలని…రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రానికి చంద్రబాబు రెండు టెర్మ్ ల పాటు.. అంటే పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. 1995లో సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు… తిరిగి 1999లోనూ టీడీపీని విజయతీరాలకు చేర్చి వరుసగా రెండో పర్యాయం ఉమ్మడి ఏపీకి సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. తెలుగు నేలకు ఈ పదేళ్లే స్వర్ణ యుగం అని చెప్పక తప్పదు. ఈ పదేళ్ల కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు పెట్టింది. ఇప్పుడు వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా విలసిల్లుతున్న సైబరాబాద్ కు పునాది వేసింది చంద్రబాబేనన్న విషయం తెలిసిందే. సైబరాబాద్ కు పునాది రాయి వేయడంతో పాటుగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీలన్నీ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించేలా చంద్రబాబు చేశారు. ఈ కారణంగానే అనుకున్న దాని కంటే కూడా హైదరాబాద్ అనతి కాలంలోనే కొత్త రూపు సంతరించుకుంది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు రాజకీయ నేతలతో పాటు జనం కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటారు.