పౌరాణిక చిత్రాలు తీయాలన్నా, అందులో అభినయించాలన్నీ.. యన్టీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన తర్వాత ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నది బాలయ్యే. ఈ జోనర్ లో ఆయన అందెవేసిన చెయ్యి. దానవీరశూరకర్ణలో అభిమన్యుడిగానూ, శ్రీకృష్ణార్జున విజయంలో శ్రీకృష్ణునిగానూ, అర్జునిగానూ, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగానూ అలరించిన బాలకృష్ణ.. అప్పట్లో తన తండ్రి నటించిన ‘నర్తనశాల’ సినిమా మీద ఎంతో మక్కువతో.. దాన్ని మళ్లీ రీమేక్ చేయాలని తన స్వీయదర్శకత్వంలో భారీ ఎత్తున మొదలు పెట్టారు . ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి నటించారు. ఆ సినిమా ను మొదలుపెట్టిన కొద్ది రోజులకే సౌందర్య యాక్సిడెంట్ లో చనిపోయింది. దాంతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది.
ఎప్పటికైనా ఆ సినిమాను పూర్తి చేస్తానని అప్పట్లో చాలా సార్లు చెప్పారు బాలకృష్ణ. అయితే సౌందర్య లాంటి నటీమణికి ఆల్టర్ నేట్ దొరకకపోవడంతో .. ఆ ప్రాజెక్ట్ మూలనపడింది. మళ్ళీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ? అసలు ఆ సినిమా చిత్రీకరణ తిరిగి కొనసాగుతుందా అనే సందేహం ఇప్పటికీ అభిమానుల్లో ఉంది. అయితే ఇంతలోనే బాలకృష్ణ ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది అంటూ బాలయ్య ప్రకటించారు. మరి బాలయ్యను అర్జునునిగా, సౌందర్యని ద్రౌపదిగా చూడాలంటే.. ఈనెల 24 వరకూ ఆగాల్సిందే.