ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అధ్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మొదటగా కుప్పం నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయనుంది. కుప్పం ఏరియా హాస్పిటల్‌లో ఈ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. టాటా కంపెనీ సహకారంతో డిజిటల్ సర్వే సెంటర్‌ని ప్రారంభించారు చంద్రబాబు.
కుప్పం నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ట్రీట్‌మెంట్ కోసం వచ్చే రోగుల డేటాను డిజిటల్ రూపంలో టాటా కంపెనీ పొందుపరచనుంది. రోగులకు వ్యాధులపరంగా డేటా నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో వారి ట్రీట్‌మెంట్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కుప్పంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏపీవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఏపీలో ఈ కార్యక్రమం సక్సెస్ ఐతే కేంద్ర ప్రభుత్వం దేశమంతటా కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అతి కొద్ది దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉంది. రోగులకు అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడనుంది.











