విశాఖ జిల్లా జుత్తాడలో ఇటీవల జరిగిన ఆరుగురి హత్యోదంతంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఒకే ఇంటిలో ఆరుగురిని హత్య చేసింది అప్పలరాజేనని ఇప్పటిదాకా అనుకుంటూ ఉండగా… తాజాగా బాధిత కుటుంబం కొత్త ఆరోపణ చేసింది. ఈ హత్యోదంతంలో అప్పలరాజుతో పాటు మరో ఐదుగురు కూడా పాలుపంచుకున్నారని, దీంతో ఈ కేసులో మొత్తం నిందితులు ఆరుగురు అని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు సోమవరం విశాఖలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌తో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్‌లను కలిసిన బాధిత కుటుంబ సభ్యులు ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అరుణ కుమారుడు ఫిర్యాదు
ఈ కేసులో చనిపోయిన వారిలో అరుణ అనే మహిళ కూడా ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం కలెక్టర్, మంత్రిని కలిసిన వారిలో అరుణ కుమారుడు కూడా ఉన్నారు. ఈ హత్యోదంతంలో అభంశుభం తెలియని వారు కూడా ఉన్నారని, ఇలా అప్పలరాజు పాత గొడవలతో ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా హత్య చేసిన తీరు చూస్తుంటే… ఈ ఘటనలో అప్పలరాజుతో పాటు మరో ఐదుగురు కూడా పాలుపంచుకున్నారని అరుణ కుమారుడు ఫిర్యాదు చేశారు. ఆరుగురిని పొట్టనబెట్టుకున్న అప్పలరాజుతో పాటు మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటుగా మొత్తం ఆరుగురిని చంపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అప్పలరాజు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి
అంతేకాకుండా జుత్తాడలో ఉన్న అప్పలరాజు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని కోరారు. అప్పలరాజు పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడగట్టాడని, వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని కోరారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా నిందితుడు ఒక్కడేనని అంతా భావిస్తున్న సమయంలో ఆరుగురిని చంపింది ఒక్కడు కాదని… ఈ దారుణానికి ఒడిగట్టింది మొత్తం ఆరుగురు అని బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.











