కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన మెర్సెక్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరించడానికి భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ – APMB ద్వారా రాష్ట్రంలో ఓడరేవు , టెర్మినల్ అభివృద్ధిని స్పీడప్ చేయడానికి A.P.మోల్లర్ – మెర్సెక్ గ్రూప్‌లో భాగమైన APM టెర్మినల్స్‌తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
APM టెర్మినల్స్ 2004 నుండి ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న గుజరాత్ పిపావావ్ పోర్ట్ లిమిటెడ్ , మహారాష్ట్రలోని JNPA పోర్ట్‌లో ఉన్న గేట్‌వే టెర్మినల్స్ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంటైనర్, బల్క్ హ్యాండ్లింగ్‌లో సామర్థ్యాన్ని పెంచడంలో కంపెనీ ముందంజలో ఉంది. APM టెర్మినల్స్, అవగాహన ఒప్పందంలో భాగంగా, ఆధునికీకరించిన ఓడరేవులు, టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్‌లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.
ఈ పెట్టుబడి ద్వారా 8,000 నుంచి 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. లాజిస్టిక్స్ కార్యకలాపాలు పెరగడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి.అత్యాధునిక టెర్మినల్స్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోర్టుల అభివృద్ధి కూడా ఈ ఒప్పందంలో భాగం. ఆంధ్రప్రదేశ్‌కు సముద్ర తీరం అత్యంత విలువైన ఆస్తి అని చంద్రబాబు చెబుతూ ఉంటారు. వాటిని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మెర్సెక్ అధినేతతో చంద్రబాబు 10 నిమిషాల సమావేశమే పెట్టుబడుకు మార్గం చూపించిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ పెట్టుబడులు సకాలంలో పూర్తి అయితే, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, వాణిజ్యపరంగా మరింత పురోగతి సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు











