హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ చైర్మన్ గా ఎన్నికైన టీమిండియా మాజీ సారధి మొహ్మద్ అజారుద్దీన్ ను ఆ పదవి నుంచి తొలగించిన అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేస్తూ అంబుడ్స్ మెన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంబుడ్స్ మెన్ జస్టిస్ దీపక్ శర్మ కీలక నిర్ణయాన్ని వెలువరించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజార్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అజార్ స్థానంలో జాన్
సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ వివేక్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా ఆ పదవి కోసం నామినేషన్ వేసిన అజారుద్దీన్.. వివేక్ ప్యానెల్ ను ఓడించి చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం పాటు హెచ్‌సీఏ వ్యవహారాలు సాఫీగానే సాగినా.. ఇటీవల ఉరుము లేని పిడుగు మాదిరిగా అజార్ ఎన్నిక చెల్లదంటూ అపెక్స్ కౌన్సిల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా అజారుద్దీన్ ను ఆ పదవి నుంచి తొలగిస్తూ జాన్ మనోహర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది.
అపెక్స్ ను రద్దు చేసిన అంబుడ్స్ మెన్
అయితే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ అంబుడ్స్ మెన్ లో పిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అంబుడ్స్ మెన్ తన తీర్పును ఆదివారం వెల్లడించింది. అజార్ ను ఉన్నపళంగా పదవి నుంచి పీకేసిన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం చెల్లదని తీర్పు చెప్పిన అంబుడ్స్ మెన్ జస్టిస్ దీపక్ శర్మ.. అంతటితో ఆగకుండా అపెక్స్ కౌన్సిల్ నే రద్దు చేసేసింది. అయితే అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేస్తూ అంబుడ్స్ మెన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని అజారుద్దీన్ వ్యతిరేక వర్గం వాదిస్తోంది. దీనిని తాము సవాల్ చేస్తామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏలో ఇంకెన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.










