తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయతీపై నోరు విప్పారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మొత్తం రాజకీయ ప్రయోజనాల కోసమే మొదలైందంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి.. జల వివాదంపై కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో అసలు ఈ గొడవను కేసీఆర్ సర్కారే తన రాజకీయ ప్రయోజనాల కోసం మొదలుపెట్టిందని కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కృష్ణా జలాలపై సరికొత్త వాదనలు వినిపిస్తున్న కేసీఆరే ఈ మొత్తం వివాదానికి కారణమని కూడా రేవంత్ ఆరోపించారు.
నాడు 34 శాతం… ఇప్పుడు 50 శాతం
ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారంటే.. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక ఏపీతో కృష్ణా నదీ జలాల విషయంలో వివాదం తలెత్తితే.. కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో నాడు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావులు తమ అదికారుల బృందంతో కూర్చుని మాట్లాడుకుని నీటి వాటాలపై తేల్చేసుకున్నారు. జనాభా ప్రాతిపదికన, సాగు నీటి ఆయకట్టు ప్రాతిపదికన తెలంగాణకు 34 శాతం నీరు, ఏపీకి 66 శాతం నీరు వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రతిపాదన మేరకే ఏడేళ్లుగా తెలంగాణ 34 శాతం నీటి వాటాలతోనే సరిపెట్టుకుంటోంది. ఇప్పుడు కేసీఆర్ కొత్తగా తెలంగాణకు 50 శాతం వాటా కాలాలని ఎలా కోరతారు? 34 శాతం సరిపోతుందన్న నోటీతోనే 50 శాతం ఎలా అడుగుతారు? ఎగువ రాష్ట్రాలతో మాట్లాడి నీటి పంచాయతీలు తెంచిన కేసీఆర్ ను మెచ్చుకుంటాం. మరి దిగువ రాష్ట్రంలో చర్చించేందుకు ఎందుకు ఉత్సాహం చూపరు?** అని రేవంత్ ప్రశ్నించారు.
జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయండి
అసలు ఏపీతో నీటివాటాలపై తెలంగాణ పంచాయతీ ప్రజల కోసం కాదన్న రేవంత్… కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. అలా కాదంటే అదే విషయాన్ని కేసీఆర్ ఎందుకు వెల్లడించడం లేదన్నారు. ఈ నెల 9న జరగనున్న కృష్ణా నీటి యాజమాన్య బోర్డు(కేఈఆర్ఎంబీ) సమావేశానికి హాజరు కారాదని ఎందుకు తీర్మానించారని ప్రశ్నించారు. నిజంగా తెలంగాణ ప్రజల బాగు కోసమే పోరాడుతుంటే… బోర్డు సమావేశానికి హాజరై తెలంగాణ వాదనను ఎందుకు వినిపించరని కూడా రేవంత్ ప్రశ్నించారు. బోర్డు సమావేశాన్ని పక్కనపెట్టినా… నిజంగానే తెలంగాణ ప్రజల బాగు కోసమే కేసీఆర్ ఆకాంక్షిస్తుంటే.. న్యాయమైన వాటాల కోసం తన కుమారుడు కేటీఆర్ తో కలిసి డిల్లీకి వెళ్లి జంతక్ మంతర్ వద్ద దీక్షకు దిగాలని రేవంత్ డిమాండ్ చేశారు. మొత్తంగా నీటి పంచాయతీపై స్పందించిన రేవంత్ రెడ్డి… కేసీఆర్ సర్కారును ఆత్మరక్షణలో పడేశారని చెప్పక తప్పదు.











