తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోపం వస్తే ఎలాగుంటుందో? చాలా సార్లే చూసి ఉంటాం. అయితే తాజా ఘటనలో ఎవరిపై విరుచుకుపడాలో తెలియక.. కేసీఆర్ తనలో తానే మదనపడిపోతూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు మాత్రం నిజంగానే అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఏదేనీ ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నారంటే.. అధికారులు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో తెలిసిందే కదా. అయితే సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారుల మొద్దు నిర్లక్ష్యం కళ్లకు కట్టింది. కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. అయితే ఎవరినీ ఏమనలేక.. కత్తెరతో రిబ్బన్ కట్ చేయాల్సిన కేసీఆర్.. దానిని చేతితోనే తెంపేసి తన కోపాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొడుకు ఇలాకాలో కేసీఆర్ పర్యటన
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఇటీవలే జిల్లాల పర్యటనలను మొదలెట్టిన కేసీఆర్.. ఆదివారం తన కుమారుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసల్ల పర్యటనకు వెళ్లారు. అక్కడ పలు ప్రారంభోత్సవాల్లో పాలుపంచుకున్న కేసీఆర్.. పనిలో పనిగా తన ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవానికీ హాజరయ్యారు. అధికారులు ఎంపిక చేసిన ఇంటి వద్దకు వెళ్లిన కేసీఆర్ కు ఘనంగానే స్వాగత సత్కారాలు అందాయి. ఆ తర్వాత అసలు ఘటన చోటుచేసుకుంది. ఇంటి ప్రారంభోత్సవం కోసం ఆ ఇంటి తలుపునకు ఓ రిబ్బన్.. అది కూడా టీఆర్ఎస్ రంగు అయిన గులాబీ రంగు రిబ్బనే కట్టారు. ఇక్కడి దాకా బాగానే ఉన్నా.. ఆ రిబ్బన్ ను కట్ చేసేందుకు వినియోగించాల్సిన కత్తెరను అక్కడ పెట్టడం అధికారులు మరిచిపోయారు. ఆ కత్తెర ఉన్న పళ్లెం పట్టుకున్న పంతులు కూడా ఆ విషయాన్ని గుర్తించలేదు.
చేతితో రిబ్బన్ ను లాగేశారే
తీరా గుమ్మం ముందు నిలుచున్న కేసీఆర్.. రిబ్బన్ కటింగ్ కు సిద్ధమై కత్తెర కోసం చూడగా… పళ్లెం పట్టుకున్న పంతులు పళ్లెంలోని చిన్న గుడ్డ ముక్కను అటూఇటూ తిప్పి.. పళ్లెంలో కత్తెర లేదని గ్రహించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకింత ఆగ్రహంగా గమనిస్తూ వచ్చిన కేసీఆర్.. కత్తెర లేని విషయంపై ఎవరిని అడగాలని కాస్తంత తల పక్కకు తిప్పి చూశారు. అయితే జనం చాలా మందే ఉన్నా.. తాను ప్రశ్నించాల్సిన అధికారి మాత్రం కనిపించలేదు. దీంతో రిబ్బన్ కటింగ్ కు కత్తెర లేదు.. సమాధానం చెప్పాల్సిన అధికారీ లేడు.. అన్నట్లుగా కోపంగా చూసిన కేసీఆర్.. ఆ రిబ్బన్ ను అలా చేత్తో పట్టుకుని ఇలా లాగి పడేశారు. అంటే.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కత్తెరతో కట్ చేయాల్సిన రిబ్బన్ ను కేసీఆర్ తన చేతితో తెంపేశారన్న మాట. ఈ ఘటనకు ఎవరు బాధ్యులో.. వారిపై ఎలాంటి చర్యలుంటాయోనన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.










