నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ ఇంకా అయిపోలేదు. ఆయన జగన్ సర్కార్ పై మరోమారు హైకోర్టు గడప తొక్కారు. తమ విధులలో ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోందని ఆయన హైకోర్టులో పీటీషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. తప్పుడు కేసులు వేస్తూ ఎన్నికల సిబ్బందిని వేధిస్తున్నారని ఆవేదన తెలిపారు. తమపై సీఐడి పెట్టిన కేసులను కొట్టి వేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌లో హోం కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డిజిపి, సిఐడిలను రమేష్ కుమార్ ప్రతివాదులుగా చేర్చారు.
ఎస్ఈసీ అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా మరో పీటీషన్ ను కోర్టులో దాఖలు చేశారు. ఈ రెండు పీటీషన్లను హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. కరోనా తీవ్రత నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తూ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తితో సీఎం జగన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిప్పులు చెరిగారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి కులాన్ని ఆపాదిస్తూ విమర్శలు చేశారు. ఆ తరువాత ఓ స్పెషల్ జీవోని తీసుకువచ్చి రమేష్ కుమార్ ను తొలగించారు.
దీంతో ఆయన హైకోర్టులో పీటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు నిమ్మగడ్డకు సానుకూల తీర్పను ఇవ్వగానే ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం సుప్రీంకి వెళ్ళింది. అక్కడ కూడా ప్రభుత్వం రాజ్యాంగ పదవిలో జోక్యం చేసుకోవడమేంటని ప్రశ్నించింది. నిమ్మగడ్డను తిరిగి నియమించడం తప్పా గత్యంతరం లేని ప్రభుత్వం అందుకు ఒప్పుకుంది. ప్రభుత్వం తమ విధులలో జోక్యం చేసుకుంటోదని నిమ్మగడ్డ కోర్టుకెళ్ళడం ప్రభుత్వానికి చిక్కులు తప్పేలా లేదు.