విధాత తలఁపున ప్రభవించినట్లుగానే ఆయన పాట ప్రవాహం సాగిపోయింది. ‘సమాజాన్ని నిగ్గదీసి అడిగినప్పుడు’ ఆయనలో విప్లవ కవి కనిపించాడు. విప్లవ కవి. ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ’ ముడిపెట్టి రాసినప్పుడు ఔరా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. ‘తూనీగ తూనీగ’ అంటూ చిలిపిగానూ కవ్వించారు.. మూడు వేల పైచిలుకు పాటలతో జనాన్ని మైమరపించారు. సినిమా పాటల పూదోటలో సిరివెన్నెల కురిపించిన సీతారామశాస్త్రి మరణంతో తెలుగు పాట మూగవోయింది. ఆయన రాసిన పదాలూ.. వాటిని పలికే పెదాలూ నివ్వెరపోయాయి.
వేటూరి తర్వాత ఆ స్థాయిలో తెలుగు పాటను పరిపుష్టం చేసిన ఘనత ఒక్క సిరివెన్నెల సీతారామశాస్త్రికే దక్కుతుంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ సిరివెన్నెల అనే సినిమా చేయాలనుకున్నప్పుడు అందులో పాటలు రాసే అవకాశం సీతారామశాస్త్రికి కల్పించాలని ఎందుకనుకున్నారోగానీ ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ పాటల ప్రయాణం దాదాపు 800 చిత్రాల వరకూ సాగిపోయింది. తెలుగు శ్రోతలను మంత్రముగ్ధులను చేసే పాటలు ఎన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. 11 నంది అవార్డులు పొందిన ఘనత ఆయనకే దక్కింది. భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ పురస్కారంతో ఆయన సాహితీ సేవను గౌరవించింది. తొలి పాటతోనే తెలుగు శ్రోతల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

అనకాపల్లి నుంచి సినిమా తల్లి ఒడిలోకి..
సీతారామశాస్త్రి ప్రస్థానం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ప్రారంభమైందనే చెప్పాలి. తండ్రి పేరు డాక్టర్ సీవీ యోగి, తల్లి సుబ్బలక్ష్మి. డిగ్రీ పూర్తి చేశాక ఎంబీబీఎస్ చదమని తండ్రి ఒత్తిడి చేసినా దాన్ని పెడచెవిన పెట్టారు. ఆయనకున్న పదో తరగతి అర్హతతోనే బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం వచ్చింది. చిన్నప్పట్నుంచి కవితలు రాయడం ఆయనకు అలవాటు. దాన్ని మొదట గుర్తించింది ఆయన సోదరుడే. ఆ మాటలు కొండంత బలాన్ని ఇవ్వడంతో సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. స్నేహితులతో కలిసి తరచూ సాహితీ సభలకు వెళ్లేవారు. భరణి అనే కలం పేరుతో కవితలు రాసేవారు. ఎంఏ చేస్తుండగా దర్శకుడు కె. విశ్వనాథ్ నుంచి సినిమాలో పాటలు రాయాల్సిందిగా పిలుపును అందుకున్నారు. అలా ఆయన జీవితంలో ‘సిరివెన్నెల’ కురిసింది.
సినిమా ప్రస్థానంతో సుస్థిర స్థానం
తొలి సినిమాతోనే చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు సీతారామశాస్త్రి. మొదటి సినిమాలో పదాల గాఢత కనిపించినా ఆ తర్వాత సినిమా సన్నివేశాలకు అనుగుణంగా చిన్ని చిన్న పదాలతోనూ పాటలను అలవోక రాశారు. రుద్రవీణ చిత్రంలో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ’ పాటే అందుకు ఓ ఉదాహరణ. ఆయన పాటల్లో ఎంతటి పిలాసఫీ ఉంటుందో తెలియడానికి చక్రం చిత్రంలోని ‘జగమంత కుటుంబం నాది’ పాట చాలు. గమ్యం సినిమాలో ఆయన రాసిన ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని’ అనే పాట తన మనసుకు బాగా నచ్చడంతో అందులో నటించారు కూడా.
సిందూరం సినిమాలో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నేస్వతంత్ర మందామా పాట వింటే ఆయనలో ఇంతటి విప్లవ భావాలు ఉన్నాయా అని కూడా అనిపిస్తుంది. ఆయన మూడు వేల పైచిలుకు పాటల్లో ఏ పాటకు ఆ పాటే ఆణిముత్యం. మురారి సినిమాలో ఓ పెళ్లి పాట ‘అలనాటి రామచంద్రడు అన్నింటా సాటి..’ ఎంత పెద్ద హిట్లో ప్రత్యేకించి చెప్పలేం. రాబోయే పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ లో ‘దోస్తీ’ పాట రాసింది కూడా ఆయనే. సిరివెన్నెల సీతారామశాస్త్రి మనముందు లేకపోయినా ఆయన అందిన పాట మాత్రం మన మధ్యే ఉంటుంది.
Must Read ;- ‘ఆర్ఆర్ఆర్’ జనని పాటతో మీడియా ముందుకు రాజమౌళి











