సినీ రంగంలో సెంటిమెంట్ కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తారు. కాకపోతే… నెగెటివ్ సెంటిమెంట్స్ జోలికి పోరు. పాజిటివ్ సెంటిమెంట్స్ ను అక్కున చేర్చుకొని పదే పదే రిపీట్ చేస్తుంటారు. కొందరు వేరే నటీనటుల ప్రెజెన్స్ ను సెంటిమెంట్ గా తీసుకుంటారు. మరికొందరికి టైటిల్స్ సెంటిమెంట్ విపరీతంగా ఉంటుంది. ఇంకొందరు టైటిల్ లోగోల్ని సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక చాలామంది స్టార్స్ కు రిలీజ్ డేట్స్ లో మ్యాజిక్ నెంబర్స్ సక్సెస్ సెంటిమెంట్ అయి కూర్చుంటాయి. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఆయనకి 9 నెంబర్ భలేగా కలిసి వచ్చింది. ఇప్పటివరకూ 9 వ తేదీన విడుదలైన ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపేశాయి.
1984 నుంచీ మెగాస్టార్ చిరంజీవి సినిమాల విడుదల తేదీలు పరిశీలిస్తే.. ఆ ఏడాది ఆగస్ట్ 9న విడుదలైన ‘ఛాలెంజ్’ సినిమా … చిరు కెరీర్లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై, కె.యస్.రామారావు నిర్మాణంలో, ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ డబ్బు పవరాఫ్ డబ్బు నవల ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో ఆ సినిమా భారీ వసూళ్ళు సాధించింది.
1987 జనవరి 9న ‘దొంగమొగుడు’ సినిమా విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ నవల నల్లంచుతెల్లచీర ఆధారంగా ..ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా అప్పట్లో తెలుగునాట దుమ్ము రేపేసింది. చిరు ద్విపాత్రాభినయం ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.
1990 లో.. చిరంజీవి నటించిన మూడు సినిమాలు 9 వతేదీనే విడుదలవడం విశేషమైతే.. ఆ మూడు సినిమాలూ.. సూపర్ హిట్స్ ను సొంతం చేసుకోవడం రికార్డు గా చెప్పుకోవాలి. ఆ ఏడాది మార్చ్ 9న విడుదలైన ‘కొండవీటి దొంగ’ మ్యూజకల్ గా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. అలాగే.. ఏప్రిల్ 9న విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా గురించి అయితే.. చెప్పనే అక్కర్లేదు. అతిలోక సుందరి శ్రీదేవి అభినయం సినిమాకే హైలైట్ కాగా.. చిరు యాక్టింగ్ , డాన్స్ ఏ రేంజ్ లో సంచలనమయ్యాయో అందరికీ తెలుసు. ఇక అదే సంవత్సరం ఆగస్ట్ 9న విడుదలైన ‘కొదమసింహం’ సినిమా.. అప్పట్లో మంచి వసూళ్ళు సాధించింది. చిరంజీవి నటించిన మొట్టమొదటి కౌబాయ్ సినిమాగా కూడా అది విశేషాన్ని సంతరించుకుంది.
1991, మే 9న విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’.. చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. అంతేకాదు.. ఈ సినిమా శతదినోత్సవాల్ని నాలుగు నగరాల్లో ఒకేసారి జరిపి.. ఆ విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేశారు.
1992, ఏప్రిల్ 9న విడుదలైన‘ ఘరానా మొగుడు’ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిన విషయమే. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవీ వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కథ పరంగానూ, సంగీతం పరంగానూ బాక్సాఫీస్ వద్ద సంచనం సృష్టించింది.
1998 , ఏప్రిల్ 9న విడుదలైన చిరంజీవి సినిమా ‘బావగారూ బాగున్నారా..?’సూపర్ హిట్ గా నిలిచి.. భారీ కలెక్షన్స్ సాధించింది. ఇందులో చిరంజీవి చేసిన బంగీ జంప్ ను అభిమానులు మరిచిపోలేరు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 9 కూడా మెగాస్టార్ చిరంజీవికి లక్కీ డేట్ కానుంది. అదెలా అంటే… ఆయన నటిస్తోన్న 152వ సినిమా ఆచార్యను ఆ డేట్లోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట.
ఈ ఏడాదే విడుదలవ్వాల్సిన ఆ సినిమా .. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా చిత్రీకరణ జరుపుకోలేకపోయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆచార్య సినిమా షూటింగ్ పున:ప్రారంభమవుతుంది. అందుకే ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మరి 9 సెంటిమెంట్ ‘ఆచార్య’కి ఏ స్థాయిలో కలిసి వస్తుందో చూడాలి.











