ఒక దర్శకుడిపై నమ్మకం కుదరాలే కానీ… జయాపజయాలతో సంబంధం లేకుండా.. అతడికి వరుస ఆఫర్స్ వచ్చిపడుతుంటాయి. అలాంటి ఓ లక్కీ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్. తమిళంలో ‘అలై’, ‘యావరుమ్ నలమ్’ లాంటి ఇంటెలిజెంట్ మూవీస్ తో అందరి దృష్టినీ ఆకర్షించాడు విక్రమ్. అతడి పనితనం చూసే.. హిట్స్ లేని నితిన్ .. ‘ఇష్క్’ సినిమా ఇచ్చాడు. సినిమా సూపర్ హిట్టవడంతో.. విక్రమ్ కె. కుమార్ పేరు టాలీవుడ్ లో మారు మోగింది. దాంతో అతడి మీద అక్కినేని వారి కన్నుపడింది.
ఎప్పటి నుంచో తమ బ్యానర్ లో .. ఓ ఫ్యామిలీ మూవీ తీయాలనుకుంటున్న టైమ్ లో .. నాగార్జున నమ్మకాన్ని నిలబెడుతూ.. తాత,తండ్రి, మనవళ్ళతో ‘మనం’ తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచీ విక్రమ్ కుమార్ అంటే.. అక్కినేనివారి కుటుంబానికి మంచి గురి. ఆ నమ్మకంతోనే సూర్యతో తీసిన 24 అంతగా ఆడక పోయినప్పటికీ.. అఖిల్ కు హిట్టిచ్చే బాధ్యతను అతడికి అప్పగించారు. అఖిల్ రెండో సినిమాగా తెరకెక్కిన ‘హలో’.. బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అంతేకాదు.. ఆ తర్వాత విక్రమ్ .. నానీ తో తెరకెక్కించిన ‘గ్యాంగ్ లీడర్’ సైతం నిరాశపరిచింది.
అయినప్పటికీ విక్రమ్ కుమార్ మీద నాగార్జున నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదు సరికదా.. ఈసారి నాగచైతన్య తో సినిమా తెరకెక్కించే అవకాశం ఇచ్చారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా.. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. నాగచైతన్య కెరీర్లో 20వ చిత్రంగా రానున్న “థాంక్యూ” ని శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి లు నిర్మించనున్నారు. నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్తూ మేకర్స్ ‘థాంక్యూ’ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘మా 20 ఏళ్ళ సినీ ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు థాంక్యూ’ అని దిల్ రాజు, నాకు ‘మనం’ సినిమా ఇచ్చినందుకు థాంక్యూ’ అని విక్రమ్ కె.కుమార్.. ‘నా కింగ్ అయినందుకు థాంక్యూ’ అని నాగ చైతన్య అక్కినేని నాగార్జునకు శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటి వరకు చూడని స్టైల్లో సరికొత్తగా నాగచైతన్యను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుందని.. మేకర్స్ చెబుతున్నారు. అక్కినేని వారి కుటుంబానికి.. ఫ్యామిలీ ఫోటో లాంటి ‘మనం’ సినిమాను ప్రెజెంట్ చేసిన విక్రమ్ కె. కుమార్ .. తమ్ముడు అఖిల్ కు ‘హలో’ మూవీ తో ఇండివిడ్యువల్ గా హిట్టివ్వలేకపోయాడు. మరి ఇప్పుడు అన్నయ్య నాగచైతన్యకైనా .. ‘థాంక్యూ’ సినిమాతో హిట్టిస్తాడేమో చూడాలి.











