అందరూ స్వీటీ అంటూ ముద్దుగా పిలుచుకునే అనుష్క ‘నిశ్శబ్దం’గానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎప్పుడో జనవరి, ఫిబ్రవరిలో విడుదల కావలసిన ఈ సినిమాను బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ఏప్రిల్ 2న విడుదల తేదీ ప్రకటించినా కరోనా కారణంగా విడుదల వాయిదా పడిపోయింది. ఓటీటో విడుదల విషయంలో ఇదిగో అదిగో అంటూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అక్టోబరు 2న ఈ సినిమాను అమెజాన్ లో చూడవచ్చు.
సైరా నరసింహారెడ్డి తర్వాత అనుష్క నటించిన సినిమా ఇది. సైరాలో ఝాన్సీలక్ష్మీభాయిగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ హార్ట్ టచింగ్ పాత్రను పోషించినట్లు నిర్మాత చెబుతున్నారు. కోన వెంకట్ సొంత ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, హిందీలలో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మాధవన్ ఇందులో సెలబ్రిటీ మ్యుజిషియన్ గా ఆంథోని పాత్రలో కనిపిస్తాడు. దీనికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. మాధవన్, షాలినిపాండే, అంజలి, సుబ్బరాజు, అండ్రూ హడ్సన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.హాలీవుడ్ నటుడు మైఖేల్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలా వద్దా అనే విషయంపై కోన వెంకట్ చాలాకాలం తర్జనభర్జన పడ్డారు. ఒకవేళ థియేటర్లు ప్రారంభమైనా జనం వస్తారో రారోనన్న సందిగ్ధం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ తప్ప మరో మార్గం లేదని ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో నిర్మాత కోన వెంకట్ సామాజిక మాధ్యమాల్లో ఒపీనియన్ పోల్ నిర్వహించి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారు. అమెజాన్ తో ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. ఈ సినిమా విడుదలకు సంబంధించి వెంటనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాకు రెండు రోజుల ముందు తమిళ హీరో సూర్యనటించిన సూరారై పోట్రు కూడా ప్రైమ్ వీడియోస్ లో విడుదలవుతోంది.











