ఈ రోజు మాఘమాసంలో శుక్ల ద్వాదశి. ఈ రోజును విశ్వకర్మ జయంతిగా జరుపుకోవడం మనకు ఆనవాయితీ. మన సనాతన ధర్మం ప్రకారం అసలు కార్మికుల రోజు ఈరోజే. ఈ విశ్వకర్మ జయంతికి ఇంత ప్రత్యేకత ఎలా వచ్చింది? ఈరోజు మనం ఏంచేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ సకలచరాచర జగత్తును సృష్టించింది బ్రహ్మేనని మన పురాణాలు చెబుతున్నాయి. సకల జీవరాశిని బ్రహ్మ సృష్టించిన తర్వాత మనుషులు బతకడానికి అవసరమయ్యే పనిముట్లు, ఇళ్లు తదితర అవసరాల కోసం విశ్వకర్మను కూడా సృష్టించాడని అంటారు.
దీనికి భిన్నమైన వాదన కూడా ఉంది. ఆయన స్వయంభువు అని కూడా అంటారు. వాస్తుకు మూలపురుషుడు విశ్వకర్మేనని అంటూ ఉంటారు. విశ్వకర్మ రాసిన ఆ వాస్తు శాస్ర్తమే నేడు ఆధునిక వాస్తుకు మారిందని అంటారు. మహాభారతంలో మయసభను నిర్మించింది విశ్వకర్మే అంటుంటారు. అయితే మహాభారతం కాలం నాటి విశ్వకర్మ వేరు, స్వయంభువుగా వెలసిన విశ్వకర్మ వేరు అని కూడా అంటారు.
విశ్వకర్మకు మూలాలేమిటి?
విశ్వకర్మ గురించిన ప్రస్తావన రుగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో ఉంది. సకల పాపాలను హరించేవాడుగా విశ్వకర్మ గురించి మన వేదాలు పేర్కొన్నాయి. భూమి – నీరు – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర -సూర్య – నక్షత్రాలు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తానుగా జన్మించాడంటారు. పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషుడిగా వర్ణించింది. మహాభారతం విశ్వకర్మను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది. హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో విశ్వకర్మ నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకాన్ని, త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడట. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని, కలియుగంలో హస్తినాపురాన్ని, ఇంద్రప్రస్థను నిర్మించాడంటారు.
ఈ రోజు మనం ఏంచేయాలి?
మన సనాతన ధర్మం ప్రకారం విశ్వకర్మ జయంతిని శ్రామికుల దినం అంటారు. అంటే మనం పనిచేసే చోటే పవిత్రమైనది. ఆ ప్రదేశంలోనే మనం దైవాన్ని దర్శించుకోవాలట. మనం ఏ పనిముట్లతో పనిచేస్తామో వాటిని ఈరోజు పూజించాలి. కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో విశ్వకర్మ జయంతిని ప్రత్యేకంగా జరుపుతుంటారు. మనం మేడేని కార్మికుల దినోత్సవంగా భావిస్తుంటాం. దాని ప్రత్యేకత దానికుంది. ఇది మన సనాతన ధర్మం ప్రకారం జరుపుకునే కార్మిక దినోత్సవం.