‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కరోనా తర్వాత శుభారంభం ఇచ్చిందనే అనుకోవాలి. సినిమా రేటింగుల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఐఎండీబీ కూడా ఈ సినిమాకి 10 పాయింట్లకు 8.4 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఓటింగ్ ఆధారంగా ఐఎండీబీ ఈ రేటింగులు ఇస్తుంది. ఈమధ్య కాలంలో ఈ తరహా రేటింగ్ ఐఎండీబీ ‘కలర్ ఫొటో’ సినిమాకి మాత్రమే ఇచ్చింది. ఆతర్వాత ఇంకే సినిమాకీ ఈ తరహా రేటింగ్ ఇవ్వలేదు. కరోనా కారణంగా సినిమా థియేటర్ల వ్యవస్థ ఎంతగా కుప్పకూలిందో అందరికీ తెలుసు.
ఇలాంటి తరుణంలో థియేటర్లను ప్రారంభించడం సాహసంతో కూడిన చర్యే. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా విడుదలైనా కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా కుమ్మేస్తోంది. ఒక సినిమా అనేది వందలు, వేల జీవితాలతో ముడిపడిన అంశం. సినీ పరిశ్రమ జీవం పోసుకోవాలన్నా ఇలాంటి హిట్లు సినీ పరిశ్రమకు అవసరం. అలాంటిది చెత్త రివ్యూలతో సినిమాని చంపే ప్రయత్నం ఓ పక్క జరుగుతోంది. కోడిగుడ్డుకు ఈకలు పీకే తరహాలో రివ్వ్యూలు ఇవ్వడం ఇలాంటి తరుణంలో మంచిది కూడా కాదు. వినోదం పాళ్లు మెండుగా ఉన్న ఈ సినిమాని జనం ఆదరించడం విశేషం. అందరూ ఈ సినిమా విజయం మీదే ఆశలు పెట్టుకుని ఉన్నారు.
ఈ సినిమా విడుదలయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి తమ సినిమాలను విడుదల చేయాలన్న యోచనలోనూ ఉన్నారు. ఈ సినిమా ఇచ్చిన ఫలితం చూశాక అందరూ తమ చిత్రాలను విడుదల చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరో విశేషం ఏమిటంటే ఇంతకుముందు ఓటీటీలో విడుదలైన చిత్రాలను కూడా ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాని థియేటర్లలో చూస్తే ఫీల్ వేరన్న విషయం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం మరోసారి నిరూపించింది. హీరోగా సాయిధరమ్ తేజ్ కు మరో హిట్ దక్కినట్టుగానే భావించాలి. ఇక అందరికీ మరోసారి ప్రతిరోజూ పండగ చేసే సినిమాని సాయిధరమ్ తేజ్ అందించాడు.











