కరోనాకి వ్యాక్సిన్ రాదా? హీరో నందమూరి బాలకృష్ణ మాటలు అలానే ఉన్నాయి. కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని, ప్రజలే తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని అన్నారు. కార్తిక మాసంలో చన్నీళ్ళ స్నానం చేస్తుంటారని, చల్లదనానికి కరోనా మరింత ప్రబలే అవకాశం ఉంటుందని, ప్రజలు చన్నీళ్ల స్నానం చేయకుండా ఉండటమే మేలని అన్నారు. కరోనా మన జీవితాంతం ఉంటుందన్నారు.
రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా, వైద్య రంగంలో ఉన్నా ప్రజా సేవ తమకు ముఖ్యమని అన్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా తను రావాల్సి ఉందని, వారు తనను ఆహ్వానించడానికి వచ్చినపుడు కథ విన్నానని, చాలా బాగుందని, తాను కూడా కొన్ని మార్పులు చేర్పులు సూచించానని వివరించారు. కార్తిక సోమవారం నాడు ఈ సినిమా పోస్టర్ విడుదల కావడం శుభసూచకమని అన్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగీత దర్శకుడు కోటి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త తారలతో రూపొందుతున్న ‘సెహరి’ చిత్రం ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా వర్గో పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి జ్ఞాన సాగర్ దర్శకుడు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని దర్శకుడు అంటున్నారు. హీరో తండ్రి పాత్రను కోటి పోషిస్తున్నారు. ఈ సినిమా పేరు కొత్తగా ఉంది. దాని అర్థం ఏమిటంటే ఇంగ్లీషులో సెలబ్రేషన్ అని. ప్రశాంత్ ఆర్. విహారి దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.