మొదటి నుంచి కూడా కీర్తి సురేశ్ అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఈ రెండు భాషల్లోను స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలు .. రెండు తమిళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. రజనీకాంత్ తో చేసిన ‘అన్నాత్తే’ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆమె మరో చిత్రంగా ‘సాని కాయిధమ్’ రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దీపావళి’ కానుకగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ పోస్టర్ ను ధనుశ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
‘సాని కాయిధమ్’ ఫస్టులుక్ పోస్టర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘దండుపాళ్యం’ సినిమాలో ఓ నేరస్థురాలు పాత చీరను ధరించి .. చేతులు కట్టుకుని .. మోకాళ్లపై మోచేతులు ఉంచి కూర్చుంటుంది. ఆమె అలా కూర్చోవడం జనంలో బాగా రిజిస్టర్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కూర్చుని కీర్తి సురేశ్ ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఆమె మెడపై నెత్తురు మరకలు .. ఎదురుగా కొన్ని పదునైన ఆయుధాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే పాత్ర పరంగా ఆమె నేరస్థురాలు అనే విషయం అర్థమవుతోంది. ఈ పోస్టర్ లో ఆమె సహచరుడిగా కనిపిస్తున్నది ఎవరో కాదు .. దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.
కథా వస్తువు ఏమిటనేది తెలియదుగానీ, ఇప్పుడు ఈ లుక్ అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీర్తి సురేశ్ పాత్ర స్వరూప స్వభావాలు తెలుసుకోవాలనే కుతూహలం నెటిజన్లలో పెరిగిపోతోంది. ఇప్పటివరకూ అటు కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేసినా, ఇటు హీరోల జోడీగా ఆడిపాడినా ఆమె గ్లామర్ కే అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. కానీ తొలిసారిగా ఆమె ‘కథ’ ప్రధాన పాత్రగా నడిచే సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించడానికి సిద్ధమైంది. ఫస్టు లుక్ పోస్టర్ వదిలిన తరువాత, ఈ సినిమా ఆమె కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.











