దళిత యువతిపై హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకుల చర్య వివాదాస్పదమవుతోంది. నిందితులకు మద్దతు తెలుపుతూ హత్రాస్ లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అగ్రవర్ణాల వారు పాల్గొన్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. యూపీ సీఎం యోగి కులానికి చెందిన వారే ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి తల్లితండ్రులు పిల్లలను పద్దతిగా పెంచాలని హితువు చెప్పారు. మరీ ముఖ్యంగా కూతుళ్ళను సక్రమంగా పెంచితే ఇలాంటి ఘటనలు జరగవని కామెంట్ చేయడంపై విమర్శలు వినబడుతున్నాయి. జరిగిన దారుణమైన ఘటనను ఖండించవలసింది పోయి ఇలాంటి ప్రకటనలు చేస్తూ బీజేపీ నాయకులు సభ్య సమాజానికి దారుణమైన మెసేజ్ ఇస్తున్నారు.
ఏమి జరిగిందంటే…
19 ఏళ్ళ దళిత యువతిపై అగ్రవర్ణాల వారు పైశాచికంగా దాడి చేసిన ఘటన యూపీ, హత్రాస్ లో చోటు చేసుకుంది. ఆ యువతి నాలుక కోసి, నడుం విరగొట్టి నరకయాతనకు గురి చేశారు. చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆమెను ఢిల్లీ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ చికిత్స తీసుకున్న ఆమె తుది శ్వాస విడిచారు. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ యువతిపై అత్యాచారం జరగలేదని ఓ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై అనుమానాలు రేకెత్తాయి. ఇదే సమయంలో ఆమె మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా దహనం చేశారు. ఖననం చేయకుండా దహనం చేయడంపై విమర్శలు ప్రచారం జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. పోలీసులు బాధ్యతయుతంగా వ్యవహరించలేదని సిట్ నివేదిక ఇవ్వడంతో యూపీ ప్రభుత్వం ఐదు మంది పోలీసు అధికారులపై వేటు వేసింది.
సొంత పార్టీ నుంచే విమర్శలు
బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శిచేందుకు వచ్చిన విపక్షాల నాయకులను పోలీసులు హత్రాస్ బోర్డర్ లోనే అడ్డుకున్నారు. డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేశారు. నిర్భయ కేసులో వాదనలు వినిపించిన లాయర్ ను కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అత్యాచార అనుమానాలు బలపడ్డాయి. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచే యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ సినియర్ నాయకురాలు, ఉమా భారతి కూడా ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. దీంతో యోగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.











