యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమరం భీంగా ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ కావాలని ప్లాన్ చేశాడు. కరోనా మహమ్మారి ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో మొత్తం ప్లానింగ్ మారిపోయింది. ఖాళీ సమయం దొరకడంతో త్రివిక్రమ్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన గురూజీ నటీ నటుల ఎంపికలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ కార్పొరేట్ టైకూన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘అయిననూ పోయిరావాలే హస్తినకు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాలీవుడ్ వర్గాలలో వినబడుతోంది. చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాకి కాపీ అంటూ వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ ఈ వార్తలు అవాస్తమని క్లారిటీ ఇచ్చేసింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ ప్రేక్షకులను అలరించింది. విజయవంతమైన కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
సోషల్ మీడియాలో #ntr30 హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్రెండ్ ను కొనసాగిస్తూ సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ చిత్ర యూనిట్ కు ట్యాగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై ట్వీట్ చేశారు. షూటింగ్ మొదలు పెట్టేవరకు ఎదురుచూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. షూటింగ్ మొదలు కాగానే సినిమా అప్డేట్స్ ఇస్తామని తెలిపారు. సినిమా టైటిల్ని ప్రకటించకూడదన్నది మా సెంటిమెంట్. మా మీద విశ్వాసం వుంచండి, త్వరలోనే మీ ముందుకు పెద్ద విశేషాన్ని తీసుకువస్తామని ఆయన ట్వీట్ చేశాడు. పెద్ద విశేషం? ఏంటనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. హీరోయిన్ కు చెందిన అప్డేట్ ఇస్తారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని హారిక-హాసిని క్రియేషన్స్, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.











