అధికార పార్టీకి దగ్గర సంబందాలు ఉండటంతో బాబా రాందేవ్ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో బిడ్డింగ్ లో పాల్గొన్న ఆయనకు నిరాశ మిగిలింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2020 స్పాన్సర్ గా డ్రీమ్ 11 సంస్థ ఎంపికైంది. అధికారిక స్పాన్సర్ గా ఉన్న వివో స్వచ్ఛందంగా తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త సంస్థలను ఆహ్వానించింది. టీమిండియాకు స్పాన్సర్ గా ఉన్న బైజుస్, పెప్సీ, అమెజాన్ సంస్థలతో బాటు బాబా రామదేవ్ కు చెందిన పతంజలి సంస్థలు పోటీ పడ్డాయి. అందరి కంటే ఎక్కువగా కోట్ చేసిన డ్రీమ్ 11 సంస్థను ఈ సంవత్సరానికి స్పాన్సర్ గా ఎంపిక చేసింది. ఒక్క సంవత్సరానికే డ్రీమ్ 11 సంస్థ 222 కోట్లు చెల్లించేందుకు ముందుకు రావడం విశేషం. ముంబైకు చెందిన గేమింగ్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న క్రికెట్ లీగ్ కు స్పాన్సర్ గా వ్యవహరించనుండటం గమనార్హం.
గ్వాలన్ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో స్వదేశీ ఉద్యమం దేశంలో ఊపందుకుంది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్నేళ్లుగా ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్న వివో తప్పుకోవాలని డిమాండులు వచ్చాయి. బీసీసీఐ పెద్దల నుంచి మద్దతు లభించినా స్వచ్ఛందంగా వివో తప్పుకుంది. దీంతో బీసీసీఐ కొత్త కంపెనీలను ఆహ్వానించింది. ఇండియాలో కరోనా ఉదృతి నేపథ్యంలో వేదికను దుబాయ్ కు మార్చారు. సెప్టెంబర్ 19న ఈ మహాసంగ్రామం ప్రారంభం కానుంది. నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ పొట్టి క్రికెట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.