ఏపీ పోలీసులు మరో వివాదంలో చిక్కుకున్నారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు లక్ష్మీపురం వచ్చిన పోలీసులు విగ్రహాలు పెట్టడానికి అనుమతులు లేవంటూ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి కృష్ణా నదిలో వేయడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విషయం విశ్వహిందూ పరిషత్ సభ్యులకు తెలియడంతో వారు రంగ ప్రవేశం చేశారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసుల అత్యుత్సాహం
పోలీసుల అత్యుత్సాహంతో మొత్తం డిపార్టుమెంటు పరువు బజారున పడినట్టయింది. అసలే హిందూ దేవాలయాపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అప్రదిష్ట మూటకట్టుకుంది. తాజాగా లక్ష్మీపురంలో దుర్గమ్మ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులే తొలగించడంపై విశ్వహిందూపరిషత్ సభ్యులు, శివస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండో రోజు అమ్మవారి విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
మీరు వెళ్లొద్దు
గ్రామస్థులకు మద్దతుగా విశ్వహిందూ పరిషత్ కీలక సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు. ఆ తరవాత విశ్వహిందూ పరిషత్ సభ్యులు తిరిగి వెళుతుండగా గ్రామస్థులు వారిని వారించారు. మీరు వెళితే తమకు న్యాయం జరగదని వేడుకున్నారు. దీంతో శివస్వామి, విశ్వహిందూ పరిషత్ సభ్యులు అక్కడే నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకుంటున్నారు. హిందూ దేవాలయాలపై దాడులతో వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి విగ్రహం తొలగించిన పోలీసులను సస్పెండ్ చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ కదిలేది లేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.










