త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. సుదీర్ఘ కాలంపాటు అధికారానికి దూరమైన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి కలిసి ఆర్జేడీ మహాకూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో ఆ పార్టీ బలాన్ని బట్టి సీట్లను సర్దుబాటు చేసింది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ 144 స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేయనున్నాయి. లెఫ్ట్ పార్టీలకు 29 సీట్లు ఇఛ్చారు. సీపీఐ (ఎంఎల్ ) 19 సీట్లలోను, సీపీఐ 6, సీపీఎం 4 స్థానాల్లో పోటీకి దిగనున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. వికాషీల్ ఇన్సాన్ పార్టీ, జార్ఖండ్ ముక్తిమోర్ఛా పార్టీలు ఎప్పటి నుంచో ఆర్జేడీ వెంట నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీలకు తమ144 సీట్లలో కేటాయిస్తామని ఆర్జేడీ అధినాయకత్వం తెలిపింది.
లాలూ మాటే లేని ఎన్నికలు
‘జబ్ తక్ సమోసామే ఆలూ రహతే హై తబ్ తక్ బీహార్ మే లాలూ రహతే హై’ అంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ప్రకటన చేశాడు. ఆయన చేసిన ప్రకటన అక్షరాలా నిజం. 1990-2000 మధ్య కాలంలో లాలూ చెప్పిందే వేదం చేసిందే చట్టంలా సాగింది. రాష్ట్రంలో యాదవులు, బ్రాహ్మణులు, క్షత్రియులు ఎక్కువ మంది లాలూకు మద్దతు తెలపడంతో ఆయన 1990లో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడి నుంచి బీహార్ లో లాలూ చక్రం తిప్పారు. అవినీతి, బంధుప్రీతి, గుండాయిజం లాలూ పరిపాలనలో పెరిగిపోయిందని విమర్శలు ఎదురయినా ఆయన మరోమారు విజయం సాధించారు. దాణా కుంభకోణంలో ఆయన అరెస్ట్ కావడంతో తన సతీమణి రబ్రీదేవిని సీఎంగా చేశారు. దీంతో అప్పటివరకు లాలూ వెంట నడిచిన శరద్ యాదవ్, నితీష్ కుమార్ కూటమి నుంచి బయటికి వచ్చారు. ఇక అక్కడి నుంచి నితీష్ కుమార్ హవా సాగింది.
నితీష్ కుమార్ హవా
రైల్వేశాఖ మంత్రిగా 1998-1999 మధ్యకాలంలో పని చేసిన నితీష్ కుమార్ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు. గైసాల్ రైల్వే దుర్ఘటనకు బాధ్యత వహించి ఆయన మంత్రి పదవికి రాజినామా చేశారు. దీంతో ఆయన ఇమేజ్ డబల్ అయింది. ఆ తరువాత కేంద్ర రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్ర రాజకీయాల వైపు ద్రుష్టి సారించారు. 2005 ఎన్నికలలో ఘనవిజయం సాధించి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ వ్యవస్థలను సమూలంగా మార్చివేసి అభివృద్ధి వైపు ఘనత సొంతం చేసుకున్నారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తన పార్టీ దారుణ పరాజయం చెందడంతో సీఎం పదవికి ఆయన రాజినామా చేశారు. జితన్ రామ్ కు సీఎం బాధ్యతలు అప్పగించి నితీష్ కుమార్ తప్పుకున్నారు. కానీ జితన్ రామ్ నుంచి ఆశించిన మేరకు పరిపాలన లేకపోవడంతో ఆయన 2015లో తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2015లో జరిగిన ఎన్నికలలో బీజేపీని దూరంగా పెట్టి ఆర్జేడీతో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ప్రజలు తిరిగి ఆయనకు పట్టం కట్టారు. కానీ 2017లో కూటమిలో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆర్జేడీకి దూరం జరిగిన నితీష్ తిరిగి బీజేపీ మద్దతుతో మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో కూడా నితీష్ కుమార్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా ఈ కూటమిలో ఉంది. మరొకమారు అధికారంలోకి రావాలని నితీష్ కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రతిపక్షాల ధీమా
ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ప్రతిపక్షాలు భారిగా ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో సొంతంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ ఈ సారి ఎన్నికలలో నితీష్ కుమార్ పార్టీని ఓడిస్తుందని వస్తున్న వార్తలపై గట్టిగానే ప్రతిపక్షాలు నమ్మకాన్ని పెట్టుకున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వ వైఫల్యం కూడా ప్రతిపక్షాలకు అవకాశాన్నిచ్చాయి. ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనేది నవంబర్ 10న తేలనుంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశలలో జరగనున్నాయి. మొదటి దశ అక్టోబర్ 28, రెండవ దశ నవంబర్ 3 మూడవ దశ నవంబర్ 7న జరగనున్నాయి.











