కృష్ణ- గోదావరి నదుల నీటి వాటాల విషయంలో నెలకొన్న వివాదాలపైన మొదలైన ఈ పర్వం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మాటల యుద్ధం వరకు చేరింది. దీంతో కేంద్రం జోక్యం చేసుకొని అపెక్స్ సమావేశాన్ని ఈ నెల 6న ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ఎవరికి వారు తమ వాదనలను బలంగా వినిపించేందుకు అన్నిరకాలుగా రెండు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే సమగ్ర రిపోర్టును సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
కాగా, తెలంగాణ సిఎం కెసిఆర్ నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలనే కయ్యానికి కాలు దువ్వుతుందనే ఆరోపణలను లేవనెత్తారు. కానీ ఈ విషయంపై ఏపీ సిఎం జగన్ మాత్రం అంతగా స్పందిచలేదు. కానీ ఇతర నాయకులు మాత్రం గట్టిగానే బదులిచ్చారు. సిఎం కెసిఆర్ ఏదైనా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగానే మాట్లాడుతారు. జగన్ తక్కువేమీ కాదు. కానీ జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారనేది చర్చగా మారింది. మౌనంగానే ఉంటూ అపెక్స్ సమావేశంలో తెలంగాణకు ఎలా బదులియ్యాలనే దానిపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులను ఆ సమావేశానికి అన్నివిధాలా సిద్ధం చేస్తున్నట్లు కనబడుతోంది. మాటలతో కాకుండా తమ వాదనలను కేంద్రం ముందు ఆధారాలతో చూపించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎవరికి వారూ తమ తమ ప్లాన్‌లతో సమావేశానికి హాజరయ్యేందుకు కత్తులు నూరుతున్నట్లు సమాచారం.
టీమ్‌కు దిశానిర్ధేశం…
కృష్ణా- గోదావరి నీటి వివాదానికి సంబంధించి ఈ నెల 6న కేంద్ర మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే అపెక్స్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లు, న్యాయనిపుణులు, ప్రభుత్వ సలాహాదారులతో చర్చించారు కూడా. కృష్ణా-గోదావరి నీటి పంపకాల్లో జరగిన అన్యాయం, ఏపీ అవలంబిస్తున్న వైఖరీ, తెలంగాణ నీటి పారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలతో వెళ్ళేలా వారిని సంసిద్ధం చేసినట్లు తెలిసింది.
ఇరువర్గాల వాదనలు..
రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలనే వాదనను తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుతుంది. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 సెక్షన్ ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా అయినా తెలంగాణకు సక్రమంగా నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ కోరుతోంది. వాస్తవంగా తమకు వచ్చే వాటా నీళ్లను ఏపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపిస్తోది. అలాగే ఏపీ కూడా తమ పాయింట్ ఆఫ్ వ్యూలో మా హక్కులను తొక్కిపడుతోందని తమ వాదనలను కేంద్రం ముందు వినపించబోతోంది.
మౌనంతోనే సమాధానమా?
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ప్రభుత్వంపై నీటి పంపకాల విషయంలో బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా సిఎం జగన్ మాత్రం సైలెంట్‌గానే ఉండమనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనదైన శైలీలో కెసిఆర్ అంతలా విమర్శలు చేసినా జగన్ ఎందుకు స్పందిచలేదనే చర్చ జరుగుతోంది. అంటే తన మౌనంతోనే కెసిఆర్‌కు సమాధానం చెప్పబోతున్నారా? దీనికి సంబంధించి వర్కౌట్‌ను ఇప్పటికే పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ఆరోపణలను తిప్పికొట్టేందుకు జగన్ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నారట. అందుకే మౌనంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ సమావేశం రెండు ప్రభుత్వాల మధ్య వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఇరువురు సిఎంలు తమ రాష్ట్రాల వాదనను కౌన్సిల్‌లో వినిపించేందుకు సంసిద్ధమై ఉన్నారు. 6న జరిగే సమావేశంలో ఎవరి వాదనలు ఎలా ఉంటాయో చూడాలి మరి.