కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా .. అనే పాట వినగానే ఓ అందమైన అమ్మాయి రూపం కనురెప్పల మధ్య పడి నలుగుతుంది .. ఆ అమాయి పేరే ‘రేఖ’. ‘ఆనందం’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆ సినిమా, ప్రేమకథా చిత్రాల వరుసలో ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా యూత్ లోకి దూసుకుపోయింది. అలాంటి సినిమాతో పరిచయమైన రేఖ .. తన జోరు చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు.
‘ఆనందం’ సినిమా సూపర్ హిట్ కావడంతో రేఖను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వచ్చాయి. ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ .. ‘దొంగోడు’ .. ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ .. ఇలా చేస్తూ వచ్చిందిగానీ, మొదటి సినిమా స్థాయిలో ఆమెకి హిట్ పడలేదు .. మొదటి పాత్ర స్థాయిలో మరోపాత్ర పేలలేదు. అందువలన సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో మాతృభాష అయినా కన్నడపైనే ఈ అమ్మాయి దృష్టి పెట్టింది .. అక్కడే బిజీ అయింది. ఒకటీ అరా మాత్రమే తెలుగు సినిమాలు చేస్తూ కన్నడలోనే కంటిన్యూ అయింది.
తెలుగు తెరకి పూర్తిస్థాయిలో ఆమె దూరమైపోయి పుష్కర కాలమైపోయింది. అలాంటి ఆమె ఇప్పుడు తిరిగి తెలుగులో నటించడానికి ఆసక్తిని చూపుతోంది. తెలుగుకి సంబంధించిన సినిమాలకు తొలిప్రాధాన్యతను ఇస్తాననీ, ఇక ఓటీటీ సినిమాలు .. వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. సీనియర్ హీరోయిన్లకు ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి పాత్రలు లభిస్తున్నాయి .. పారితోషికం కూడా బాగానే ముడుతోంది. మరి రేఖ ఏ దర్శకుడి దృష్టిలో పడుతుందో .. ఏ సినిమాలో మెరుస్తుందో చూడాలి.











