విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పెందుర్తి టిక్కెట్టుపై హామీ లభించకపోవడంతోనే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు రమేష్ బాబు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏడాది పాటు పనిచేశారు. రాజీనామా సమయంలో రమేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జి సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని రమేష్ బాబు స్పష్టం చేశారు.
వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామాపై మీడియాతో మాట్లాడిన పంచకర్ల రమేష్ బాబు.. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని.. బాధగా ఉందన్నారు. ఏడాది కాలంగా అనేక సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. కింది స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కానప్పుడు ఈ పదవి చేపట్టడం సమంజసం కాదన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రమేష్ బాబు తెలిపారు.
పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైంది. రాష్ట్ర విభజన తర్వాత రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ లతో కలిసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీని వీడి 2020 ఆగస్ట్‌లో వైసీపీలో చేరి.. ఇప్పుడు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఆయన ఎక్కడికి వెళుతున్నారో తెలియాల్సి ఉంది. జిల్లాలో సీట్ల ఖరారులో భాగంగా రమేష్ బాబు పెందుర్తి సీటును ఆశించారు. ఆ సీటు గ్యారెంటీ లేని కారణంగానే పార్టీని వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది.
అయితే పంచకర్ల వైసీపీ కి రాజీనామా చేయడంతో రాజకీయ దూమారం చెలరేగుతోంది. వైసీపీలో ఏమి జరుగుతుంది? వైసీపీలో నెక్స్ట్ అతనేనా? అని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీ నాయకుల వెన్నుపోటు కారణంగానే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు తెలుస్తోంది..