‘అభిలాష’లో చిరంజీవి, ‘ధర్మక్షేత్రం’ లో బాలయ్య , ‘శత్రువు, ధర్మచక్రం’లో వెంకీ, ‘అధిపతి’లో నాగార్జున.. ఇలా సీనియర్ హీరోలందరూ అప్పట్లో నల్లకొట్లు తొడిగి అభిమానుల్ని మెప్పించారు. అయితే ఆ తర్వాత తరం హీరోలెవరూ లాయర్ వేషాలు వేయలేదు. కథ కుదరకో, లేక ఆ హీరోలకు ఆసక్తి లేకో తెలియదు కానీ.. ఇప్పటి యంగ్ హీరోలు మాత్రం నల్ల కోటు తొడిగి.. యువరానర్ అని కోర్ట్ లో వాదించే ప్రయత్నం చేయలేదు. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం .. త్వరలో ‘వకీల్ సాబ్’ గా తనదైన స్టైల్ లో కోర్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. పవర్ స్టార్ కమ్ బ్యాక్ మూవీ కాబట్టి.. దీనిపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి.
‘పింక్’ బాలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా .. ఆ మధ్య తమిళంలో అజిత్ తో ‘నేర్కొండ పార్వై’ గా విడుదలై.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఒరిజినల్ వెర్షన్ ను అజిత్ ఇమేజ్ కు తగ్గట్టుగా పలు మార్పులు చేసి.. విడుదల చేయడంతో అక్కడ వర్కవుట్ అయింది. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ మూవీ కోసం దర్శకుడు .. వేణు శ్రీరామ్ అదే ఫార్మేట్ ఫాలో అవుతున్నాడు. ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నిజానికి ఈ సమ్మర్ లోనే విడుదల కావాల్సిన సినిమా .. లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా వేసుకుంది.
‘కాటమరాయుడు’ తర్వాత మూడేళ్ళు సినిమాలకు గ్యాపిచ్చిన పవన్ కళ్యాణ్ .. ‘వకీల్ సాబ్’ గా తిరిగి స్ర్కీన్ మీదకు అడుగుపెడుతుండడంతో.. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు.. తొలి సారిగా లాయర్ గా నటిస్తున్నాడు కూడా. ఒకప్పుడు అన్నయ్య మెగాస్టార్ … ‘అభిలాష’ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. లాయర్ గా నటించడం చిరంజీవికీ అది మొదటిసారే. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా .. ఎ.కోదండరామిరెడ్డి మలిచిన ఆ సినిమా కథ ఉరిశిక్ష రద్దు నేపథ్యంలో ఉంటుంది.
ఇక వకీల్ సాబ్ విషయానికొస్తే… ఒక అమ్మాయిని, ఆమె అనుమతి లేనిదే తాకే అధికారం ఎవరికీ లేదు. అనే పాయింట్ ను టచ్ చేస్తూ సినిమా కథ సాగుతుంది. మరి ఈ కథాశంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా ఏ మేరకు మెప్పిస్తాడు? ఆయనకి నల్లకోటు అన్నయ్య రేంజ్ లో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.











