పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంచేసినా దానికో లెక్కుంటుంది. రాజకీయాల్లో ఆయన దూకుడు పెంచాలంటే మరో మూడేళ్లు ఆగక తప్పదు. అందుకే చకచకా సినిమాలు చేయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టుంది. సెప్టెంబరు 2 ఆయన పుట్టిన రోజు. ఈరోజున మూడు అనే కొత్త లెక్క తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కరోనా రాకుంటే ఈపాటికే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ విడుదలై ఉండేది. మిగతా సినిమాలు కూడా పట్టాలెక్కేసి ఉండేవి.
బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ కు ఏమాత్రం అవకాశం దొరికినా పవన్ ఊరుకునే రకం కాదు. పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ నటించే మూడు సినిమా ప్రకటనలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
ఏమిటా మూడు? ఏది ముందు ఏది వెనుక?
పవర్ స్టార్ నటించే మూడు ప్రాజెక్టుల్లో ముందు ఏది ప్రారంభమవుతుందన్నది పెద్ద ప్రశ్న. ‘ఖుషి’ నిర్మాత ఏఎం రత్నంకు పవన్ ఎప్పుడో సినిమా చేయాల్సి ఉంది. వకీల్ సాబ్ తర్వాత సెట్స్ మీదకు వెళ్లబోయేది రత్నం సినిమానే అని తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషించనుంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషాల్లో విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం.

ఇందులో పవన్ ది రాబిన్ హుడ్ తరహా పాత్ర అట. దీనికి ‘విరూపాక్ష’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో హీరో ఉన్నవారిని కొట్టి పేద వారికి అండగా ఉంటాడట. పవన్ బందిపోటుగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్ర పేరు వీరా అని ప్రచారం జరుగుతోంది. కీరవాణి దీనికి సంగీతం సమకూర్చనున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను విలన్‌గా తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ జరిగిందనే ప్రచారం కూడా ఉంది.
మైత్రీ మూవీస్ కు హరీష్ దర్శకత్వంలో…
ఇక పవన్ నటించబోయే రెండో సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థది. ఈ బ్యానర్లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తారు. నిర్మాతలు సోమవారం సాయంత్రం దీనిపై ఓ ప్రకటన కూడా చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రెండో తేదీ సాయంత్రం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మూడో సినిమా పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరిది. దీనికి సంబంధించిన తాజా అప్ డేట్ ఏమిటంటే సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ సినిమా కోసం వక్కంతం వంశీ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. సురేందర్ రెడ్డి, వక్కంతం కాంబినేషన్లో ఇంతకుముందు కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ కథలో బిజీగా ఉన్నాడట. ఈ సినిమా పూర్తయ్యాక పవన్ ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. హరీష్ శంకర్ సినిమా చేసిన తర్వాతే సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు అయ్యాక ఇంకా సమయం ఉంటే తప్ప పవన్ మరో సినిమా చేసే అవకాశం లేదు. ఆ తర్వాత ఆయన రాజకీయ కదన రంగంలోకి దూకే అవకాశాలే ఎక్కువ.












