ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవాడ వరదలో మునిగింది. గత 9 రోజులుగా విజయవాడ ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, రిజర్వాయర్లు, చెరువులకు దగ్గర్లో నివసించే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురానికి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
కాకినాడ జిల్లాలో ఉన్న ఏలేరు జలాశయం కాస్త ఆందోళన పుట్టిస్తోంది. వర్షాలతో ఏలేరు రిజర్వాయర్‌కు భారీగా నీరు వస్తోంది. మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ వరద నీటి కారణంగా పిఠాపురం ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలిసింది. జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ఇప్పటికే 20 టీఎంసీల నీరు వచ్చింది.. ఇంకా భారీగా నీరు వస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ కావాలని సీఎం ఆదేశించారు. అటు పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనున్నారు.
చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చూడాలని, ఆ గండ్లను పరిశీలించాలని పవన్ కల్యాణ్ ఇప్పటికే అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం కాకినాడలో పర్యటించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పవన్ టెలికాన్ఫిరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉందని, అక్కడి అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అధికారులు వివరించారు. ఏలేరు వరద ముప్పు పొంచి ఉన్న క్రమంలో నియోజకవర్గంలో ఉండి పరిస్థితులను స్వయంగా పవన్ పరిశీలించనున్నారు.
వరదల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని పవన్ ఆదేశించారు. ఆదివారం రోజు కాకినాడ జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎమ్మార్వోలు, ఇతర జిల్లా అధికారులతో పవన్.. రిజర్వాయర్ తీరుపై సమీక్ష చేశారు. ఏలేరు కెనాల్ ను ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే వారిని తరలించాలని పవన్ ఆదేశించారు. ఇంకా ఏలేరు, సుద్దగడ్డ వాగు ప్రభావిత మండలాల్లో తహసీల్దార్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పవన్ ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారుల నుంచి బోట్లు సేకరించాలని పవన్ సూచించారు.