(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రభుత్వ అధికారులు ఎవరూ సాధారణంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి చేయాలని కొందరు అధికారులు ఉపన్యాసాలు ఇస్తారు కాని వారి పిల్లలను మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించరు. పేరున్న ప్రైవేట్ స్కూల్‌లోనే చేర్పిస్తుంటారు. అయితే ఓ ఐఏఎస్ అధికారి మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించారు. ఆయన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.. ఆయనే విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్. ఐఏఎస్ అధికారి స్థానంలో ఉన్నప్పటికీ తన కుమారుడుని ఒక సాదాసీదా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే ..
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పిఓ కూర్మనాథ్ పదో తరగతి చదువుతున్న తన కుమారుడిని పార్వతీపురంలోని కొత్త పోలమ్మ పురపాలక పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి విద్యార్థులు మనో వికాసం సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా తాను ఎక్కడికి బదిలీ అయినా తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుస్తానన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పీఓని ఆదర్శంగా తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రగతి పథంలో పయనిస్తాయనే చర్చ జిల్లా అంతటా ఆసక్తి కలిగిస్తోంది.
Also Read: విజయనగరం రాగి విత్తనానికి జాతీయస్థాయి గుర్తింపు