దశాబ్దాలుగా రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించి, పుంగనూరు నియోజకవర్గాన్ని తన కంచుకోట మార్చుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి కూటమి ప్రభుత్వ హయాంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన ఎదురుదాడి ఆ పార్టీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేశాయి. తొలుత ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు పెద్దిరెడ్డి ప్రకటించడం, ఆ తర్వాత హడావుడిగా వెనక్కి తగ్గడం చూస్తుంటే సొంత ఇలాకాలోనే ఆయన రాజకీయ ప్రాబల్యం బలహీనపడుతోందన్న చర్చ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి ఇక్కడ చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికల అనంతరం జూన్ 15న పుంగనూరుకు వస్తున్న పెద్దిరెడ్డిని టీడీపీ శ్రేణులు గోబ్యాక్ అంటూ అడ్డుకోవడంతో ఆయన కల్లూరు వద్దే వెనుదిరిగాల్సి వచ్చింది. ఆ తర్వాత జూలైలో భూసేకరణ బాధితుల సమస్యలపై వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి వాహనాలు ధ్వంసమవడం వైఎస్సార్సీపీ వర్గానికి పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఎంపీ కాన్వాయ్ దూసుకెళ్లడంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగి, వాహనాలను ధ్వంసం చేయడమే కాక మిథున్‌ను ఓ గదిలో తలదాచుకునేలా చేశాయి. పోలీసుల గాల్లోకి కాల్పులు జరిపి రక్షణ కల్పించాల్సి రావడం ఈ కంచుకోట ఎంతలా బీటలు వారుతుందో స్పష్టం చేస్తోంది.
ఒకప్పుడు నియోజకవర్గంలో ప్రత్యర్థులను అణచివేస్తూ, దౌర్జన్యకర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా పెద్దిరెడ్డి వర్గం చెలామణి అయిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. 1989 నుంచి పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గంతో వైరం, సారా గోడౌన్ల ధ్వంసం, టీడీపీ నేతలపై దాడులు, కార్యాలయాల ఖాళీ చేయింపులు వంటి ఎన్నో వివాదాలు ఆ చరిత్రలో ఉన్నాయి. అంతేకాక, 2023 ఆగస్టులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు వద్ద కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించి, వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన పెద్దిరెడ్డి కుటుంబం… నేడు అదే నియోజకవర్గంలో తిరగలేని, సొంత పార్టీ అభ్యర్థులతో సజావుగా నామినేషన్లు వేయించలేని దుస్థితికి దిగజారడం గమనార్హం.
ఇన్నాళ్లుగా భయపడుతూ, ప్రత్యర్థుల దాడులను మౌనంగా భరించిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు పట్టు బిగించి గట్టిగా ప్రతిఘటిస్తుండటంతో పుంగనూరు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకనాడు చంద్రబాబును సైతం అడుగుపెట్టనివ్వమని హెచ్చరించిన చోటే, నేడు పెద్దిరెడ్డి కుటుంబం సొంత గడ్డపై రక్షణ కోసం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు వైఎస్సార్సీపీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బగా మారుతుండగా, పుంగనూరులో రాబోయే రోజుల్లో ఏ విధమైన రాజకీయ మార్పులకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.











