వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులుగా ఉన్న తండ్రి,కొడుకులిద్దరూ గత ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖనిజాభివృద్ధి సంస్థలోఅక్రమంగా వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు గుర్తించారు. వైసీపీ హయాంలో ఈ ముగ్గురి సిఫార్సు ఉంటే చాలు ఖనిజాభివృద్ధి సంస్థలో ఉద్యోగం వచ్చేసినట్లే. ఇంటర్ చదివిన వారికి సైతం అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇప్పించారంటే ఉద్యోగాల దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
పార్టీ కార్యకర్తలకు, సోషల్‌మీడియాలో పని చేసే వారికి, ఆఖరుకు పెద్దిరెడ్డి ఆఫీసులో పని చేసే వారికి APMDCలో అడ్డూఅదుపులేకుండా ఉద్యోగాలిచ్చారు. వైసీపీ హయాంలో కాంట్రాక్ విధానంలో 270 మంది, ఔట్ సోర్సింగ్ విధానంలో 100 మందిని తీసుకున్నారు. మొత్తం 370 మందిలో కేవలం 13 మంది మాత్రమే నోటిఫికేషన్ ద్వారా ఎంపికయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
జగన్ సర్కారులో పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గనుల శాఖలో గుత్తాధిపత్యం చెలాయించారు. వీరు చెప్పినవారికే APMDCలో ఉద్యోగాలు ఇచ్చారు. రామచంద్రారెడ్డి సిఫార్సులతో 95 మందికి, మిథున్ రెడ్డి సిఫార్సులతో 45 మందికి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పిన 60 మందికి ఉద్యోగాలిచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసులు సిఫార్సుతో 25 మందికి ఉద్యోగాలిచ్చారు. ఇక జగన్ ఓఎస్డీలు, కార్యదర్శుల సిఫార్సుతో మరో 25 మందికి ఉద్యోగం ఇచ్చారు. గత సీఎంవోలో అదానీ సంస్థ పీఆర్వోగా వ్యవహరించిన అంజిరెడ్డి సిఫార్సుతోనూ ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక వీరిలో చాలా మంది ఉద్యోగానికి హాజరుకాకున్న జీతాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో APMDC మధ్యప్రదేశ్‌లోని సిలియారీ బొగ్గు ప్రాజెక్టు మినహా కొత్త ప్రాజెక్టులేవి చేపట్టలేదు. సులియారీలో ఉత్తరాది వారినే నియమించుకున్నారు. ఐనప్పటికీ ఇక్కడ APMDCకు అవసరమంటూ 370 మందిని నియమించుకుని ఐదేళ్ల పాటు జీతభత్యాలు అందించారు. వీరిలో 70 మంది వరకు చీమకుర్తి గ్రానైట్‌లో, 300 మంది APMDC ఆఫీసులో ఉన్నట్లు చూపారు.
చిత్తూరు జిల్లా అప్పటి వైసీపీ యూత్ విభాగం అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డిని APMDC అసిస్టెంట్ మేనేజర్‌గా చూపించి..నెలకు రూ.70 వేల జీతం అందించారు.ఎన్నికల సమయంలో హేమంత్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులతో ప్రచారం చేయడం, యారా ప్రశాంత్ సోషల్‌మీడియా పోస్టులపై వార్తలు రావడంతో ఈ ఇద్దరిని తొలగించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆఫీసులో పని చేసే శ్రీతేజేష్ రెడ్డిని మేనేజర్ క్యాడర్‌గా చూపించి 70 వేలు జీతమిచ్చారు. ఈ నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు రూ.కోటిన్నర చొప్పున ఏడాదికి దాదాపు 18 కోట్లు, ఐదేళ్లలో 90 కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. సోషల్‌మీడియాలో వైసీపీకి పని చేస్తున్న యారా ప్రశాంత్ ఇంటర్ వరకు మాత్రమే చదివినప్పటికీ..నెలకు రూ.70 వేల వేతనం ఇచ్చారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.