తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పని చేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఆయన ఫోన్‌పై ఫోకస్ పెట్టారు. వంశీ ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఈ కేసులో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసే సమయంలో ఆయన ఫోన్ కనిపించలేదు. వంశీ పీఏ ఫోన్‌ను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఫోన్‌ను ఇప్పటికే ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
తాజాగా వంశీ ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. వంశీ ఫోన్ చేతికి వస్తే కేసులో గుట్టు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే హైదరాబాద్, విజయవాడలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక పోలీసుల దృష్టి తప్పించుకునేందుకు వంశీ రెగ్యూలర్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ మాట్లాడేవారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫోన్‌కు సంబంధించి IPDR వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వంశీ ఎవరెవరితో టచ్‌లో ఉన్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. వంశీని శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అక్కడ వంశీకి 7641 నంబర్‌ను కేటాయించారు అధికారులు. జైలులో ప్రత్యేకమైన గదిలో వంశీని ఉంచారు అధికారులు. ఇక ఈ కేసులో నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. ఈ పిటిషన్ ఇంకా నంబరింగ్ కాలేదు. దీనిపై ఇవాళ నిందితుడి తరపు న్యాయవాదులకు ఇవాళ నోటీసులు జారీ చేయనున్నారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ కేసులో ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సెక్షన్లు ఉండడంతో కేసు మరో కోర్టుకు బదిలీ కానుంది. ప్రస్తుతం ఇది నాలుగో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉంది.ఇక్కడి నుంచి ఫైల్స్ ఇవాళ ఎస్సీ,ఎస్టీ కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్లనున్నాయి. ఇకపై ఈ కోర్టులోనే విచారణ కొనసాగనుంది.
ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసరపల్లికి చెందిన గంటా వీర్రాజును విజయవాడలో అరెస్టు చేశారు. కేసులో రాజీపడాలని సత్యవర్ధన్‌ను వీర్రాజు ఒత్తిడి చేసినట్లు అభియోగాలు మోపారు. ఇక పెదఆవుటపల్లికి చెందిన వేల్పూరి వంశీబాబును విశాఖపట్నంలో అరెస్టు చేశారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి విశాఖలో ఉంచేందుకు మిగిలిన నిందితులకు సహకరించారు వంశీబాబు. ఈ ఇద్దరిని శుక్రవారం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. వారి CDR, టవర్ లోకేషన్ల వివరాల ఆధారంగా అన్వేషణ సాగుతోంది. వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.