పొద్దున్నే… 6.00 గంటల సమయం. ధర్మవరం పట్టణంలోని ఓ వార్డు. ఓపెన్ టాప్ కారులో ఓ వ్యక్తి వచ్చారు. ఆ కారు వెనుకే మరో రెండు, మూడు కార్లు వచ్చి ఆగాయి. ఓపెన్ టాప్ కారులో వచ్చిన వ్యక్తి నైట్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని యంగ్ టర్క్‌లా ఉన్నారు. పొడవాటి మీసకట్టు, సినిమా హీరోల మాదిరి హెయిర్ కటింగ్‌తో కనిపిస్తున్న ఆయన కారు దిగీదిగగానే… టీషర్ట్ కాలర్‌కు మైక్రోఫోన్ పెట్టుకుంటూనే కార్యరంగంలోకి దిగిపోయారు. సదరు వ్యక్తి కారు దిగంగానే… ఆయన రాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అక్కడ ఉన్నవారంతా శాలువాలు, పూల బొకేలతో ఆయనకు స్వాగతం చెప్పారు. మరికొన్ని క్షణాలకే అధికార యంత్రాంగం కూడా ఆయన దరికి చేరుకుంది. ఇంకేముంది… అన్నా బాగున్నావా? ఏం పెద్దమ్మా ఎలా ఉన్నావు? పింఛన్లు వచ్చాయా? అమ్మ ఒడి డబ్బు అకౌంట్లో పడిందా? చేనేత హస్తం కింద డబ్బు చేతికందిందా?…. ఇలా కనిపించిన వారినంతా తన సొంత మనుషుల్లా పలకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
నిత్యం అందుబాటులో..
ఇంత సోది ఎందుకు… ఆయన పేరు చెప్పొచ్చుగా అంటారా? ఆయన పేరు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే. వైసీపీలో కీలక నేత. అంతకంటే… తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి… వారి సమస్యలేమిటో వారి వద్దకే వచ్చి అడిగి మరీ తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కారం చూపుతున్న నేత. అంటే… ఆదర్శ ఎమ్మెల్యేనే కదా. నిజమే… కేతిరెడ్డి ఇటీవలి కార్యకలాపాలు చూస్తుంటే… ఆదర్శ ఎమ్మెల్యే అంటే కేతిరెడ్డిలానే ఉండాలన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. అంతేకాకుండా ఆదర్శ ఎమ్మెల్యేకు ఉండాల్సిన అన్ని లక్షణాలు కేతిరెడ్డిలో ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తోంది. మరి కేతిరెడ్డి ఏం చేస్తున్నారో, ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారో మనమూ చూసేద్దాం పదండి.
నియోజకవర్గంపై తనదైన ముద్ర
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్ది తొలి తరం రాజెకీయ నేత ఏమీ కాదు. ధర్మవరం ఎమ్మెల్యేగా 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి కుమారుడే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తండ్రి నుంచి అందిన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కేతిరెడ్డి… ధర్మవరంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. తన రాజకీయ ప్రస్థానంలో తొలి బరినే విజయంతో ప్రారంభించిన కేతిరెడ్డి… ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీ పేరిట పార్టీ పెట్టుకోగా… ఆయన వెంట నడిచిన వారిలో కేతిరెడ్డి కూడా ఒకరు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేతిరెడ్డి… టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయినా రాజకీయాలపై ఏమాత్రం అలసత్వం చూపని కేతిరెడ్డి తన వర్గాన్ని కాపాడుకుంటూనే వచ్చారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కేతిరెడ్డి… గోనుగుంట్లను ఓడించారు. తొలి సారి గెలుపు, ఆ వెంటనే ఓటమి, మళ్లీ ఆ వెంటనే గెలుపు… ఇలా ఎన్నికల్లో మిశ్రమ ఫ లితాలను చూసిన కేతిరెడ్డి… నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్ణయించుకున్నారు.
‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’
అందులో భాగంగా…. ఇటీవలే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదేనీ సమస్య ఉన్న ప్రజలు తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పడానికి బదులుగా… ప్రజల వద్దకు తానే వెళ్లి, ప్రజల సమస్యలను వారి వద్దే విని అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చేస్తే ఎలా ఉంటుందన్న భావనతోనే కేతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారట. అనుకున్నదే తడవుగా… తాను పర్యటనకు వెళ్లే ప్రాంతానికి చెందిన అధికారులకు ముందే సమాచారం ఇచ్చేసి… తెలతెలవారుతుండగానే కార్యక్షేత్రంలోకి దిగిపోతున్న కేతిరెడ్డి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోతున్నాయి. చలిలో వణుకుతూ… చేతులు రుద్దుకుంటూ వేడి పుట్టించుకుంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ తన సొంతింటి మనుషుల్లా ఆప్యాయంగా పలకరిస్తూ సాగుతున్న కేతిరెడ్డి పర్యటనలు నిజంగానే ఆయన గ్రాఫ్ ను అమాంతంగా పెంచేశాయనే చెప్పాలి. అక్కడిక్కడే పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడే క్లియర్ చేస్తూ మిగిలిన వాటిని ఎలా పరిష్కరించాలో, అధికారులకు, తన అనుచరులకు సూచనలు జారీ చేస్తూ సాగుతున్న కేతిరెడ్డి… సమస్యలు చెబుతున్న వారికి వాటిని తాను తప్పనిసరిగా పరిష్కరించేస్తానని చెప్పడంతో పాటు.. ఇక తమ సమస్యలు పరిష్కారం అయినట్టేనన్న భరోసాను జనంలో కలిగిస్తున్నారట.
జనం చేత, జనం కోసం..
మొత్తంగా జనం చేత, జనం కోసం ఎన్నుకోబడిన ఓ బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఎలా ఉండాలన్న మాటను కేతిరెడ్డి చూపిస్తున్నారన్న మాట. జనం సమస్యల కోసం వచ్చిన తనకు శాలువాలు కప్పడం, బొకేలు అందించడం మాని… సమస్యల పరిష్కారానికి మీ వంతు కృషి చేయాలని ఆయన తన అనుచర వర్గానికి చెబుతున్న మాటలు నిజంగానే అందరికీ కనివిప్పు కలిగించేవేనని చెప్పాలి. ప్రస్తుతం ధర్మవరం పట్టణంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట సాగిస్తున్న ఈ తరహా కార్యక్రమాన్ని మున్ముందు తన నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లుగా కేతిరెడ్డి చెబుతున్నారు. ఇదే జరిగితే… ధర్మవరంలో కేతిరెడ్డికి తిరుగు లేదనే చెప్పాలి.