(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాత్రిపూట ఉగ్రవాదుల తరహాలో ఆయన్ను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆక్షేపించారు. (ఆ తర్వాత కళా వెంకట్రావును విడుదల చేయడం జరిగింది) కళాను విడుదల చేయకపోతే పీఎస్‌ను ముట్టడిస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కళా అరెస్ట్‌కు వైకాపా మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం వైకాపాకు పట్టుకుందని చెప్పారు. రామతీర్థం దోషులను వదిలి, బీసీ నేతను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. తక్షణమే కళా వెంకట్రావును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కళాతో పాటు ..
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పుల దాడి ఘటనలో భాగంగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన నివాసంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీసులు కళాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం ఆయన్ను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గత నెల 29న రామతీర్థంలోని కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈనెల 2న తెదేపా అధినేత చంద్రబాబు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనకు వెళ్లారు. తొలుత వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి కిందికి వస్తున్న సమయంలో ఆయన వాహనంపైకి కొంతమంది రాళ్లు, చెప్పులు, మంచినీటి ప్యాకెట్లు విసిరారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Must Read ;- రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?
నెల్లిమర్లలోనూ ..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పలువురు టిడిపి నాయకులను, టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నేతలను ఎక్కడికి తరలించారోనని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నోటీసు ఇచ్చి పంపాం అంతే : ఎస్పీ
ఎంపీ విజయసాయిపై దాడికి సంబంధించి విచారణ నిమిత్తం కళా వెంకట్రావును స్టేషనుకు పిలిచి నోటీసు ఇచ్చి పంపాం అని.. విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు.
నెల్లిమర్ల పోలీసు స్టేషనులో ఈ నెల 2న రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం మరియు సంఘటన వివరాలు తెలుసుకొనేందుకు గాను కిమిడి కళా వెంకటరావు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఇప్పటికే పలుమార్లు కోరారని చెప్పారు.
కానీ, కళా వెంకటరావు సరిగ్గా స్పందించనందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు అధికారి అయిన విజయనగరం రూరల్ సిఐ బుధవారంనాడు కళా వెంకటరావు ను విచారణ నిమిత్తం పిలిచి, విచారణ అనంతరం, నోటీసు ఇచ్చి తిరిగి పంపారని అన్నారు.
ఈ కేసుకు సంబంధించి 7గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారని, చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉందని ఎస్పీ అన్నారు.
Also Read ;- రామతీర్థం సమస్యను సర్కారు రాజకీయం చేస్తోంది : సీపీఎం