ఏపీ సీఎం జగన్ ను ఆ పదవి నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది. న్యాయవాదులు జి.ఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేశారంటూ వారు ఆ పిటీషన్ లో తెలిపారు. 43,000కోట్ల అవినీతి కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్న వ్యక్తి సుప్రీం జస్టిస్ పై విమర్శలు చేయడం ఏంటని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
జగన్ పై 30కి పైగా కేసులు ఉన్నాయని, మనీ లాండరింగ్ కేసు కూడా నమోదయిందని వారు తెలిపారు. అలాంటి వ్యక్తి సీఎంగా తన పదవిని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారని అందుకే ఆయనని సీఎం పదవి నుంచి తొలగించాలని వారు కోరారు. జగన్ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ న్యాయవ్యవస్థ స్వయం ప్రత్తిపత్తికి భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ విధులలో రాజకీయ నేతల జోక్యం తగదని వారు ఆ ఫిర్యాదులో తెలిపారు.
జగన్ లేఖపై సీరియస్
ఇదే సమయంలో జగన్ జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సీరియస్ అయ్యాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులకు ఉద్దేశాలను ఆపాదించేలా జగన్ ప్రవర్తించారని విమర్శించాయి. జగన్ లేఖను ముక్త కంఠంతో ఖండించాయి. ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడమేంటని మండిపడ్డాయి. జస్టిస్ ఎన్వీ రమణ వృత్తి పట్ల నిబద్దత ఉన్న వ్యక్తని ఆ సంస్థలు కితాబు నిచ్చాయి.
ప్రజలు న్యాయవ్యవస్థలపై ఎంతో నమ్మకం పెట్టుకుంటారని కానీ జగన్ రాసిన ఈ లేక వారి నమ్మకాలను వమ్ము చేసేలా ఉందని పేర్కొన్నాయి. మీడియా సమావేశంలో ఈ లేఖ బయట పెట్టడమే గాక మాట్లాడటం అత్యంత దారుణమని అభిప్రాయపడింది. జగన్ ప్రభుత్వ చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వెల్లడించాయి. మొత్తం మీద జగన్ రాసిన లేఖపై దేశ వ్యాప్తంగా నిరసనలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.