(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళంలో వైసీపీ, టీడీపీ మధ్య రగులుకున్న రాజకీయ చిచ్చు ఆరడం లేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బూతులతో ప్రారంభమైన ఈ రాజకీయ చిచ్చు ఇరుపార్టీల నాయకుల సవాల్, ప్రతిసవాళ్ల మధ్య జిల్లా అంతటా దావానలంలా వ్యాప్తి చెందుతోంది.
నోరు జారిన మంత్రి సీదిరి
విశాఖ రాజధాని వద్దంటున్న తెలుగుదేశం నాయకులు పలాసలో తనపై పోటీ చేసి గెలవాలని మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన సవాల్ కు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రతిసవాల్ చేసారు. అదే అంశం ప్రాతిపదికన ఇచ్చాపురంలో తనపై మంత్రి అప్పలరాజు పోటీ చేసి గెలవాలని అశోక్ సవాల్ విసిరారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి అప్పలరాజు ‘మా తరపున వాలంటీరు పోటీ చేసి గెలుస్తారు’ అని నోరు జారారు. ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహించిన టీడీపీ వర్గాలు ‘వలంటీర్లు వైసీపీ కార్యకర్తలా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ దివాలాకోరుతనానికి నిదర్శనం : అశోక్
మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీకి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆగ్రహోదగ్రుడు అయ్యారు. మంత్రి తరపున వాలంటీరు పోటీ చేస్తాడు అనడం వైసీపీ దివాలాకోరుతనానికి నిదర్శనం అన్నారు. వాలంటీర్లు వైకాపా కార్యకర్తలా, పార్టీ ప్రతినిధులా అని ప్రశ్నించారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై కురిపించిన బూతులపై తెలుగుదేశం నాయకులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా తిప్పికొట్టారు. కృష్ణదాస్ కు వత్తాసు పలికిన మంత్రి సీదిరికి అదేస్థాయిలో టీడీపీ శ్రీకాకుళం జిల్లా తాజామాజీ అధ్యక్షులు గౌతు శిరీష సవాల్ చేశారు. టీడీపీ కి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కూడా సిద్ధం అన్నారు. దీంతో జిల్లా నలుమూలల టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి రగుల్చుతున్నారు. దీనికి ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాలి.