పోలవరం ప్రాజెక్టు..నవ్యాంధ్రకు జీవనాడి లాంటిది. ఐతే గడిచిన ఐదేళ్లు జగన్ పాలనలో పోలవరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ ఐదేళ్లూ పనులు చకచకా జరిగాయి. చంద్రబాబు సైతం సోమవారం పోలవరం పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతీ వారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పర్యవేక్షించారు. కానీ 2019లో జగన్ ప్రభుత్వం రావడంతో పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టినట్లయింది. ఐదేళ్లూ పనులు నత్తనడకన సాగాయి. దాంతో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమైంది.
ఐతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గాడిన పడింది. అనేక టెక్నికల్ సమస్యలకు పరిష్కారం వెతికి..ముందడుగు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే ప్రాజెక్టు మొత్తం మీద 6.11 శాతం పనులు చేశారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ప్రాజెక్టులో 11.58% పనులు మాత్రమే చేయగలిగారు. కూటమి ప్రభుత్వంలో తొమ్మిది నెలల్లోనే అందులో సగం మేర చేయడం విశేషం. ప్రధాన డ్యాంలో 3.80% భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 2.56% మేర పురోగతి సాధించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. విదేశీ నిపుణుల కమిటీని కేంద్ర జల్‌శక్తి, కేంద్ర జలసంఘం కలిపి నియమించాయి. దేశ, విదేశాలకు చెందిన నిపుణులు కలిసి ప్రాజెక్టును సందర్శించారు. మేధోమథనం చేసి, ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను కొలిక్కి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే కొత్తగా డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమైంది. 2025 జనవరిలో డీ వాల్ నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 1,396 మీటర్ల మేర దీన్ని నిర్మించాల్సి ఉంది. ఇంతవరకు 158.20 మీటర్ల మేర పనులు చేపట్టారు. యంత్ర సామగ్రిని పెంచి..ఈ పనులను మరింత స్పీడప్ చేయనున్నారు.
పోలవరంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించినా..వాటి సీపేజి వల్ల ప్రధాన డ్యాం ప్రాంతంలో నీరు నిండిపోతోంది. ఈ సమస్యతో పనులు చేయడం సవాల్‌గా మారింది. వర్షాలకు ముందు ఏప్రిల్, మే, జూన్ వరకు పనులు వేగంగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. జులై నుంచి గోదావరిలో వరదలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యాం సీపేజిని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు కొత్తగా బట్రస్ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు రూ.82 కోట్ల విలువతో ఈ పనులు చేపట్టారు. వర్షాకాలం లోపు ఈ కట్టడాన్ని పూర్తిచేయాలి. బట్రస్ డ్యాం నిర్మిస్తే ఎగువ కాఫర్ డ్యాం పునాదుల నుంచి వచ్చే సీపేజిని నియంత్రించొచ్చనేది ప్లాన్. దీనికితోడు డయాఫ్రం వాల్ నిర్మాణానికి సీపేజి జలాలు ఆటంకం కలగకుండా ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. ఆ ప్లాట్‌ఫాంపై మిషనరీ ఉంచి పనులను కొనసాగిస్తారు. వరదల సమయంలోనే పనులు కొనసాగిస్తూ 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేయాలనేది లక్ష్యం. బట్రస్ డ్యాం నిర్మాణంలో మొత్తం 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనిచేయాలి. ప్రస్తుతం 50 వేల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది.
జనవరి 18న డయాఫ్రంవాల్ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా 389 ప్రైమరీ, సెకండరీ ప్యానల్స్‌ను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి 28 ప్రైమరీ ప్యానల్స్‌ను నిర్మించారు. ఈ ఏడాది డిసెంబరునాటికి డయాఫ్రంవాల్‌ను నిర్మించేలా పనులు కొనసాగుతున్నాయి. జూన్-అక్టోబరు మధ్య వచ్చే వరదల కారణంగా పనులు ఆగకుండా ఉండేలా ఎగువ కాఫర్‌డ్యాంను ఆనుకుని సమాంతరంగా బట్రస్ డ్యాం నిర్మిస్తున్నారు. దీంతోపాటు జల విద్యుత్తు కేంద్రం పనులు చేపట్టారు. బెంటోనైట్ ప్లాంటు వద్ద కూడా పనులు జోరందుకున్నాయి. వైబ్రో కాంప్రెక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
D-వాల్ పూర్తయిన తర్వాత ప్రధాన రాతి, మట్టికట్ట నిర్మించాల్సి ఉంటుంది. డీ వాల్ నిర్మాణం కొంత పూర్తయిన వెంటనే గ్యాప్-2 ప్రధాన డ్యాం నిర్మించాలనేది వ్యూహం. ప్రస్తుతం గ్యాప్-1 ప్రధాన డ్యాం నిర్మాణ ఆకృతులను సమర్పిస్తున్నారు. దీనికి అవసరమైన మట్టి, రాతి మెటీరియల్ సిద్ధం చేశారు. ఏప్రిల్ రెండో వారంలోనే మొదటి గ్యాప్ ప్రధాన డ్యాం పనులు ప్రారంభించి, 2026 మార్చికి పూర్తి చేయాలనేది లక్ష్యం. గ్యాప్-2 ప్రధాన డ్యాం నిర్మాణం డీ వాల్ నిర్మాణంపై ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రధాన డ్యాం పనులు 2025 నవంబరు నుంచి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అందుకుతగ్గ పరీక్షలు, విశ్లేషణలు పూర్తి చేస్తున్నారు. వీటితోపాటు కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులూ పట్టాలకెక్కించారు. వీటిని 2026 జూన్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించారు.