వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డికి బంధువులు, కోటరీ శాపంగా మారిందా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడప జడ్పీ ఛైర్మన్ ఎన్ని నేపథ్యంలో ఆ జిల్లాలో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. కడప జడ్పీ ఛైర్మన్‌గా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ సభ్యుడు రామగోవిందు రెడ్డి పేరును వైఎస్ జగన్ కొన్ని నెలల క్రితమే ఫైనల్ చేశారు. ఈ సందర్భంలో రామగోవిందు రెడ్డితో మాట్లాడుతూ..అన్నా రూ.2 కోట్ల వరకు ఖర్చు పెట్టుకో. ఇప్పటికే మనకు కావాల్సినంత బలం వుంది. గెలుపుపై భయపడాల్సిన పనిలేదు” అని జగన్ చెప్పినట్టు సమాచారం.
అదే సందర్భంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తలో రూ.50 లక్షలు భరిస్తామని జగన్ ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. అప్పటికే రామగోవిందు రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో రెండు మండలాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో ధారళంగా ఖర్చు పెట్టిన సంగతి తెలిసే జగన్ ఆ మాట చెప్పారు. రామగోవిందురెడ్డిని జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా ఎందుకు ఎంపిక చేశారో కడప వైసీపీ నాయకులందికీ తెలుసు.
అయితే జగన్ చెప్పిందొకటి, జరిగింది మరొకటి. కడప జెడ్పీ చైర్మన్ స్థానానికి 27న ఎన్నిక జరగాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వైసీపీ క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ రామగోవిందురెడ్డి పెట్టుకున్నారు. అయితే టీడీపీ కనీసం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదని తెలిసి కూడా, రామగోవిందురెడ్డితో భారీ మొత్తంలో ఖర్చు చేయించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎత్తుగడ వేశారు. ఒక్కో జెడ్పీటీసీకి రూ.12.50 లక్షలు ఇవ్వాలని రామగోవిందురెడ్డికి చావు కబురు చల్లగా చెప్పినట్టు సమాచారం. దీంతో కడప జెడ్పీ చైర్మన్ వైసీపీ అభ్యర్థికి అసలేం జరుగుతున్నదో అర్థంకాని పరిస్థితి. అడ్వాన్స్‌గా ఒక్కో జెడ్పీటీసీకి రూ.5 లక్షలు ఇచ్చి, ఆ తర్వాత రూ.7.50 లక్షలు ఇవ్వాలని రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు షరతు విధించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ షరతుకు అంగీకరించి, జెడ్పీ చైర్మన్ ఎన్నికకు రామగోవిందురెడ్డి సిద్ధం కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
నిజంగా జెడ్పీటీసీ సభ్యులకు ఆర్థికంగా సాయం చేయాలనే పెద్ద మనసు జగన్ మేనమామ, YSR కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడైన రవీంద్రనాథ్‌రెడ్డికి వుంటే..CK దిన్నె జెడ్పీటీసీ సభ్యుడైన తన కుమారుడు నరేన్‌ను చైర్మన్‌గా నిలిపి, ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఇచ్చి వుండొచ్చనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో వుంటే, అన్ని రకాలుగా మొట్టమొదట సొమ్ము చేసుకునేది రాబందుల్లాంటి జగన్ బంధువులే. అధికారం లేనప్పుడు మాత్రం …ఇతరుల నెత్తిన చెయ్యి పెడుతుంటారని కడపలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇలాగైతే పార్టీ బతికి బట్ట కట్టేదెట్టా.? అనే ఆవేదనతో ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న సొమ్ములో కనీసం 10 శాతం లెక్క ఖర్చు పెట్టడానికి కూడా జగన్ రాబందులకు మనసు రావడం లేదనేది బలమైన విమర్శ. రామగోవిందురెడ్డితో అనవసరంగా ఖర్చు పెట్టించడంపై తన మేనమామను జగన్ తిట్టినట్టు సమాచారం. అయినా ఇవన్నీ మామూలే కదా అని తుడుచుకుని పోయేవాళ్ల గురించి ఎవరైనా ఏం మాట్లాడ్తారు? అని వైసీపీ నాయకులు అంటున్నారు.