ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి కేటాయింపుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సిఎంలు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలను బలంగా కేంద్రం ముందు వినిపించడంలో ఆయా ప్రభుత్వాలు సఫలమయ్యాయనే చెప్పాలి. ఇక బంతి మాత్రం కేంద్ర మంత్రి షెకావత్ కోర్టులోనే ఉంది. నీటి వివాదానికి సంబంధించిన నెలకొన్న వివాదాలను కేంద్రం ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తిగా మారింది.
వాడివేడిగా చర్చ…
కాళేశ్వరం, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుల విషయంలో జగన్‌కు కెసిఆర్ మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంలో మూడో టిెఎంసి ఎత్తిపోతలకు అనుమతులు లేవని సిఎం జగన్ వాదించారు. అయితే జగన్ ఆరోపణలకు బదులుగా పోతిరెడ్డిపాడుకు అసలు అనుమతులే లేవని కేసిఆర్ బదిలిచ్చినట్లు తెలిసింది. మొదటి ప్రాజెక్టే అనుమతి లేనప్పుడు రెండవది ఎలా కడుతారని కేసిఆర్ నొక్కి చెప్పారు. మధ్యలో జోక్యం చేసుకుని ఇరువురికి కేంద్రమంత్రి షెకావత్ సద్ది చెప్పినట్లు సమాచారం. డిపిఆర్ లు సమర్పిస్తే కేంద్రం అన్ని ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి చెప్పారు.
పలు సూచనలు చేసిన షెకావత్..
మంగళవారం జరిగిన అపెక్స్ సమావేశంపై కేంద్ర మంత్రి స్పందిస్తూ అన్ని విషయాల గురించి తాము పూర్తిగా చర్చించామని తెలిపారు. రెండు గంటల పాటు సాగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎంలు కెసిఆర్, జగన్ పాల్గొని తమ వాదనలను వినిపించారని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల సమస్యలపై ప్రధానంగా చర్చించామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు అయిందన్నారు. కృష్ణా బోర్డు కూడా ఏర్పాటు అయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
పలు అంశాలపై ఏకాభిప్రాయం..
ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు నీళ్లు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి కోరారు.
ప్రధానంగా నాలుగు అంశాలపైన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. అవసరమైతే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పెండింగ్ కేసులను విత్‌డ్రా చేసుకుంటామని సిఎం కెసిఆర్ కేంద్రానికి తెలిపినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లను సమర్పించాలని కేంద్రమంత్రి కోరగా దానికి సిఎంలు సుముఖత వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్‌కు మాత్రమే ఉంటుందని షెకావత్ తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
ఏడాదికోసారైనా…
రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి కౌన్సిల్ భేటీ అయింది. ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలనే ప్రతిపాదన ఈ సమావేశంలో వచ్చింది. ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం ఇంకా పరిష్కారం కాలేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్ట ప్రకారమే నడుచుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇక నుంచి ఏడాదికోసారైనా సమావేశం నిర్వహించి జల వివాదాల సమస్యలపై చర్చించేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తానికైతే వివాదం అప్పుడే సమసిపోలేదని తెలుస్తోంది.











